20 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి
స్పీకర్‌కు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రాధాన్యత గల అంశాలపై చర్చ జరగాలని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపేలా సభ జరగాలని బీజేపీ శాసన సభాపక్షం విజ్ఞప్తి చేసింది. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ కోసం 20 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహిం చాలని స్పీకర్ మధుసూదనాచారికి రాసిన లేఖలో బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి కోరారు.
రైతులకు పంట రుణాల అందజేత, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు, రుణమాఫీ, వడ్డీమాఫీ, దక్షిణ తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఇతర రైతాంగ సమస్యలపై చర్చించాలని సూచించారు. ఫసల్ బీమా యోజన అమలు, జిల్లాలు పునర్విభజన– ఆ తర్వాత ఏర్పడిన సమస్యలు, భూసేకరణ విధానం వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయం, ప్రాజెక్టుల రీడిజైనింగ్ వంటి 23 అంశాలపై చర్చించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.