నన్ను అవమానించినా సరే..
⇒ ఉద్యమాలను అవమానించొద్దు: కోదండరాం
⇒ నేను లేకపోయినా జేఏసీ కొనసాగుతుంది
⇒ పార్టీ పెట్టే సందర్భం వస్తే ఆలోచిస్తా..
సాక్షి, హైదరాబాద్: ‘‘నన్ను వ్యక్తిగతంగా అవమానించినా ఫర్వాలేదు. ఉద్యమాలను కించపర్చొద్దు..’’ అని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్(టీజేయూ) నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఆచార్య జయశంకర్ సూచించిన మార్గంలో తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తామన్నారు. టీజేఏసీ స్వతంత్ర సంస్థ అని... బోధించు, సమీకరించు, ఉద్యమించు అనే అంబేడ్కర్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. జేఏసీ ఎప్పటికీ రాజకీయ పార్టీగా మారదని కోదండరాం స్పష్టం చేశారు.
భవిష్యత్తులో తాను జేఏసీ నుంచి బయటకు పోయినా అది యథాతథంగా కొనసాగుతుందన్నారు. అయితే ప్రజాస్వామిక విలువలను కాపా డే రాజకీయ వేదిక అవసరమనే చర్చ జరుగుతోందని, తాను రాజకీయ పార్టీలో చేరాలనేదాని పై ఎలాంటి నిర్ణయం తీసుకోలే దని చెప్పారు. పార్టీ పెట్టే సందర్భం, అవసరం వస్తే ఆలోచిద్దామని చెప్పారు. తెలంగాణ సాధనకు సార్థకత లేకుండా పోతోందని.. ఏ ఉద్దేశం కోసం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో ఆ దిశగా అడుగులు పడటం లేదని వ్యాఖ్యానించారు.
వెంటనే ప్రభుత్వోద్యోగాల భర్తీ చేపట్టాలి
ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కోదండరాం.. ఈ సందర్భంగానైనా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించా లని విజ్ఞప్తి చేశారు. కొన్ని మార్పులు చేసి జోనల్ వ్యవస్థను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీజేయూ అధ్యక్షుడు కప్పర ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.