
‘క్రాంతిసేన’పై పోలీసుల ఆరా
సాక్షి, హైదరాబాద్: ‘నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటాం. అందుకు సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను విడిచిపెట్టం’ అంటూ క్రాంతి సేన పేరిట మీడియా కార్యాలయాలకు వచ్చిన లేఖ పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. క్రాంతిసేన కేంద్ర కమిటీ సభ్యులు జగత్ పట్నాయక్ (ఒడిశా), మధు (మహారాష్ట్ర) పేరిట విడుదలైన ఈ ప్రకటనపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కమిటీ నిజమైనదేనా, లేక ఆకతాయిల పనా అనే కోణంపై దృష్టి సారించారు. లేఖలో ఒక అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను నేరుగా, మిగతా వారిని షార్ట్‌కట్‌లో ప్రస్తావించారు. ప్రస్తావిత ఎమ్మెల్యేలు పీఎస్‌ఆర్, ఆర్‌ఎల్‌ఆర్, వీఆర్‌ఎం ఎవరనేది బహిరంగ రహస్యమే.
వారి పేర్లు మీడియాలో కొంతకాలంగా తరచూ ప్రస్తావనకు వస్తున్నాయి. వీరిలో ఒకరు మెదక్, ఇద్దరు నల్లగొండ జిల్లాకు చెందిన వారు. దాంతో వారి భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు అధికార పార్టీకే చెందిన ఒక ఎంపీ వల్లే నయీమ్‌తో విభేదాలు తలెత్తి ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని లేఖలో పేర్కొన్నారు. కానీ ఆయనెవరనేది ఎక్కడా ఎలాంటి క్లూ ఇవ్వలేదు.అయినా ఆయనెవరనేది పోలీసులకు స్పష్టత ఉండటంతో ఆయనకూ భద్రతను కట్టుదిట్టం చేశారు. క్రాంతిసేన పేరిట వచ్చిన లేఖను సీరియస్‌గానే తీసుకుంటున్నామని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇప్పటికే అరెస్టయిన నయీమ్ అనుచరుల నుంచి ఈ లేఖ గురించి వివరాలు సేకరిస్తున్నారు.
ప్రధాన అనుచరుల కోసం గాలింపు
మరోవైపు నయీమ్ ప్రధాన అనుచరుల కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నయీమ్ కుడిభుజం శేషన్నతో పాటు ప్రతి జిల్లాలోనూ ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తులు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. వారిని పట్టుకుంటేనే డొంకంతా కదలవచ్చని భావిస్తున్నారు. మరోవైపు నయీమ్ నేర సామ్రాజ్యంపై సిట్ దర్యాప్తులో పలు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. నయీమ్ తన అనుచరులతో పాటు డీల్ చేసే వ్యక్తులతో ఎంపిక చేసిన సెల్ నంబర్లతోనే సంప్రదింపులు జరిపేవాడని గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా తనకు అతి నమ్మకస్తులుగా 60 మందిని ఏర్పాటు చేసుకొని వారితోనే వ్యవహరాలు నడిపేవాడు. వారితో ఒక్కొక్కరికి ఒక సెల్ నంబర్ వాడేవాడు. ఒకరి నంబర్‌తో మరొకరికి అస్సలు ఫోన్ చేసేవాడు కాదు. పుప్పాల్‌గూడ నివాసంలో దొరికిన 70 సిమ్ కార్డులపై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. ఈ సిమ్‌లలో కొన్ని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ, గోవా, కర్ణాటక చిరునామాతో ఉన్నాయి. ఆయా చిరునామాలున్న నివాసాలన్నీ నయీమ్‌వేనని పోలీసులు భావిస్తున్నారు.