కృష్ణా నదీ జలాల వాడకం విషయంపై విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని రివర్ మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు.
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వాడకం విషయంపై విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని రివర్ మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు. హైదరాబాద్ లో శుక్రవారం రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో కృష్ణా నదీ బోర్డు 11 అంశాలపై చర్చించింది. ఈ జూన్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు కృష్ణానదీ జలాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వినియోగించుకునే విధానంపై చర్చించారు. జూన్ 4న హైదరాబాద్ లో కేంద్ర జలవనరులశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ కానుంది. కృష్ణా, గోదావరిలో జలాల లభ్యత, వినియోగం, ఉమ్మడి ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, నీటి విడుదల, విద్యుత్ ఉత్పాదన, బోర్డు నిర్వాహణ వ్యయం అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
బోర్డు పరిధిలోని ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పిస్తామని, అధికారుల నియామకాల వంటి అంశాలపై చర్చించినట్లు బోర్డు చైర్మన్ పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమని ఏపీ వాదించగా, ఈ రెండు ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్నందున ఆ ప్రాజెక్టులపై చర్చించడం సాధ్యం కాదని బోర్డు స్పష్టం చేసింది. త్వరలోనే బోర్డు విధివిధానాలు రూపొందిస్తామని, వాటిపై తమ అభిప్రాయాలను చెప్పాలని రెండు రాష్ట్రాలకు బోర్డు చైర్మన్ సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డు పరధిలోకి తేవాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేశారు.