
'కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆరే'
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనయ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయ వారసుడు తన సోదరుడు, మంత్రి కేటీఆరేనని కవిత చెప్పారు. కేసీఆర్ అప్పగించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్ సమర్థవంతంగా నెరవేర్చాడని ప్రశంసించారు.
గ్రేటర్ హైదరాబాద్ రాజకీయంలో చాలా మార్పు వచ్చిందని కవిత అన్నారు. నగరంలో అన్ని వర్గాల వారు టీఆర్ఎస్కు ఓటేశారని, అందుకే ఇంతటి భారీ విజయం దక్కిందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను చేపట్టిన కేటీఆర్ పార్టీ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ 99 సీట్లతో విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అని కవిత వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.