
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతోందని, పారిశ్రామిక విధానంలో గానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లోగానీ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పోటీ ప్రపంచంలో ఇంతటితో సంతృప్తి పడితే వెనకబడిపోతామని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులు, చేర్పుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు.
సీఐఐ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన ఆరు రాష్ట్రాల కార్యవర్గాల సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు విద్యా సంస్థలతో పరిశ్రమలు అనుసంధానం కావాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని, ఈ విషయంలో పరిశ్రమలు సహకరించాలని కోరారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని సంస్కరణలు తీసుకు వస్తున్నామన్నారు.
ఈ విషయంలో జర్మనీ, తదితర దేశాలు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సీఐఐకి విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ముగింపులో ఇచ్చిన హామీ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హైదరాబాద్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్’ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తామన్నారు.
ఈ నెల 22న నగరంలో జరిగే ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్మన్ వి.రాజన్న, సదరన్ రీజియన్ చైర్మన్ విక్రం కిర్లోస్కర్, వనితా దాట్ల తదితరులు పాల్గొన్నారు.