వైఎస్ హయాంలోనే పోలవరానికి అనుమతులు
చంద్రబాబు నోటివెంట పోలవరం మాట ఎప్పుడూ రాలేదు: కేవీపీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్న ప్పుడు, కాంగ్రెస్ హయాంలోనే పోలవరానికి పర్యావరణ, వన్యప్రాణి, గిరిజన మంత్రిత్వశాఖ, కేంద్ర జలవనరుల శాఖ, ఆర్థికశాఖతో పాటు అన్ని అనుమతులు వచ్చాయని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఇక్కడి ఇందిరా భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు, వైఎస్‌కు పేరు వస్తుందనే భయంతోనే సామాన్యుడైన చంద్రబాబును ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఇందిరాగాంధీ పేరిట ఉన్న ప్రాజెక్టు పేరును మార్చారని విమర్శించారు. ‘చంద్రబాబు నోటి నుంచి పోలవరం అనే మాట ఎప్పుడూ రాలేదు.
అలాంటి నోటితోనే పోలవరం నా కల అని చంద్రబాబు మాట్లాడటమే విచిత్రం, ఆశ్చర్యం. వైఎస్ వంటి ఎందరో మహానుభావుల కృషి, త్యాగం ఫలితంగా సాకారం కాబోతున్న పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు కలగా, జీవితాశయంగా, కృషిఫలితంగా వచ్చిందని చెప్పుకోవడం మేధావులు ఊహించలేరమో. ఇతరుల ఆస్తులు, పదవులు, కీర్తి, ప్రతిష్ట, ఆలోచనలు సొంతం చేసుకునే అలవాటు చంద్రబాబుకు ఉందని అనుకున్నారు. ఇతరుల కలలను సైతం సొంతం చేసుకోగల దుర్మార్గపు తెలివితేటలున్న చంద్రబాబు రాబోయే తరాలకు ఒక కొత్త పాఠం’ అని కేవీపీ వ్యాఖ్యానించారు. ఇందిరాసాగర్ పేరుతో అనుమతులు రావడానికి ముఖ్యమంత్రిగా వైఎస్ పడిన కష్టం, చేసిన కృషి ఏమిటో తనకు తెలుసని కేవీపీ చెప్పారు.