‘రాజధాని దురాక్రమణ’పై పౌరసమాజం స్పందన
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతిపై వాలిన రాబందుల రెక్కల్లో చిక్కుకున్న బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ భూమిని కాపాడాలని పౌర సమాజం న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేసింది. ‘రాజధాని దురాక్రమణ’ శీర్షికన సాక్షి దినపత్రిక బుధవారం ప్రచురించిన కథనంపై పౌర సమాజం ప్రత్యేకించి హక్కుల సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి.
ఆ భూమిని ప్రభుత్వమే సేకరించాలి
రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసిన ప్రభుత్వ పెద్దలు ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు.ఆ భూముల్ని ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద తీసుకోవాలి. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేయడంపై విచారణ జరిపించాలి.
కె.నారాయణ, సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు
చంద్రబాబుది బరితెగింపు
చంద్రబాబు అడ్డగోలు పాలనకు ఇది నిదర్శనం, ఎవ్వరూ ఏమీ చేయలేరన్న బరి తెగింపుతోనే ఆయన అనుచరులు పేదల భూముల్ని చౌకధరలకు కొనుగోలు చేశారు. ఈ తెరవెనుక బాగోతాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయించాలి.
- మధు, సీపీఎం
పేదల్ని బజారు పాల్జేశారు
రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు లేకుండా చేసే కుట్రలో భాగంగానే వారికిచ్చిన అసైన్డ్ భూముల్ని కారు చౌకగా కొన్నారు. తక్షణం ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగివ్వాలి. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తీరు మొదట్నుంచి అనుమానాస్పదంగానే ఉంది.
- గాదె దివాకర్, న్యూడెమోక్రసీ
‘హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి’
విజయవాడ: రాజధాని ప్రాంతంలో వెలుగుచూసిన కోట్లాది రూపాయల భూకుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
విచారణ జరిపి వివరాలు ప్రజల ముందుంచాలి
రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ ప్రముఖుల అవినీతిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై విచారణ జరిపించాలి. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుతంపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారం పంచుకుంటున్న పార్టీగా బీజేపీ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
-సుధీష్ రాంబొట్ల, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఈ రాబందుల నుంచి న్యాయవ్యవస్థే కాపాడాలి
Published Thu, Mar 3 2016 1:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement