ఔటర్‌పై ఎల్‌ఈడీ వెలుగులు
సిటీబ్యూరో: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)పై రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతోంది. పగలు కంటే.. రాత్రివేళల్లోనే అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్-గచ్చిబౌలి మధ్యనే ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాలు రాత్రి వేళ జరిగినవే. ఈఘటనలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వెలుతురు సరిగా లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని హెచ్‌ఎండీఏ గుర్తించింది. ఈ క్రమంలో శంషాబాద్-గచ్చిబౌలి దారిలో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు తెలిపారు. 24 కిలోమీటర్ల మేర రూ. 56 కోట్ల వ్యయంతో బల్బులు ఏర్పాటు చేసేందుకు ఫిలిప్స్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుందని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో వీటిని పూర్తి స్థాయిలో అమరుస్తారని తెలిపారు. వాస్తవంగా గంటకు గరిష్టంగా 120 కి.మీ వేగంతో వాహ నాలు రాకపోకలు సాగించేలా ఓఆర్‌ఆర్‌ని డిజైన్ చేశారు. అయితే, అంతకు మించిన వేగంతో వాహనాల రాకపోకలు సాగిస్తుండడం ప్రమాదాలకు హేతువు అవుతోంది. ఈ క్రమంలో వాహనాల వేగానికి కళ్లెం వేయడానికీ కసరత్తు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ, పోలీసు శాఖ సంయుక్తంగా వేగ నియంత్రణ చేపట్టే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.