
సీఎంది మొండి వైఖరి:లెఫ్ట్
సాక్షి, హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ మొండివైఖరితో వ్యవహరిస్తున్నారని వామపక్షాలు ధ్వజమెత్తాయి. గురువారం నుంచి సీఎం కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై మాట్లాడేందుకు ప్రయత్నించాలని నిర్ణయించాయి. బుధవారం మఖ్దూం భవన్‌లో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ) సమావేశమై మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తీరును ఖండించాయి.
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల జేఏసీ నిర్వహించనున్న నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతున్నట్లు, 11న కలెక్టరేట్ల ముట్టడిలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
వరంగల్ బరిలో గద్దర్ లేదా లక్ష్మయ్య!
వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్షాల తరఫున ప్రజాగాయకుడు గద్దర్ లేదా టీజేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యలలో ఒకరిని పోటీకి నిలపాలని సీపీఐ,సీపీఎం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బుధవారం వామపక్షాల సమావేశంలో దీనిపై చర్చించారు. అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరింత కసరత్తు చేయాలని నిర్ణయించారు.