హైదరాబాద్: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి వారితో మమేకం కావాలని, అప్పుడే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని టిపిసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోను, మైనారిటీ సెల్ సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్‌ను సంస్థాగతంగా కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్ధాయితలో కమిటీలు ఉండాలని సూచించారు.
నాయకులు, కార్యకర్తలతో మహిళా కాంగ్రెస్ బలోపేతం కావాలని అన్నారు. మహిళా కాంగ్రెస్ నిర్మాణానికి సంబంధించిన సమాచారంతో ఎఐసిసి లేఖ రాయాలని ఆయన తెలిపారు. మరో వైపు గ్రామ స్థాయి నుంచి మైనారిటీ సెల్‌ను బలోపేతం చేయాలని, మండల స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి వరకు కమిటీలను పూర్తి చేయాలన్నారు. సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు.