కేటీఆర్, తలసానిపై కేసులు పెట్టాలి : మర్రి
సాక్షి, హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి అంబేడ్కర్ నగర్‌లో ఇళ్లు ఖాళీ చేయించి మోసం చేసినందుకు మం త్రులు కె.తారక రామారావు, తలసాని శ్రీనివాస్‌పై చీటింగ్ కేసులు నమోదు చేయాలని మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. మంత్రులపై కేసులు పెట్టాలంటూ రాష్ట్ర డీజీపీకి గతంలోనే ఫిర్యాదు చేశానన్నారు. హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేస్తే కాలుష్యం అవుతుందని, నిమజ్జనం కోసం అంబేడ్కర్ నగర్‌లో కొలను కట్టిస్తామని పేదల ఇళ్లు ఖాళీ చేయించారని.. ఇళ్లు ఖాళీ చేసినవారికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారన్నారు.
ఇప్పుడు ఇళ్లు కాకుండా చెరువును నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. సనత్ నగర్‌లోని వక్ఫ్ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ నోటీసులను ఇచ్చిందని, ఈ భూమిని కబ్జా చేయాలని ఈ మంత్రులిద్దరూ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.