
బాధ్యతాయుతంగా మెలుగుతోంది
మీడియాపై ఢిల్లీ సీనియర్ జర్నలిస్ట్ వెంకటనారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మీడియా బాధ్యతాయుతంగా మెలుగుతోందని ఢిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఎస్.వెంకటనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ డే పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ‘మాధ్యమాలు-ప్రజాస్వామ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకటనారాయణ మాట్లాడుతూ.. మనదేశంలో 800 టీవీ చానళ్లు ఉన్నాయని, మీడియా వెనువెంటనే స్పందించడం వల్ల నిర్భయ లాంటి చట్టాలు వచ్చాయని, మీడియా బాధ్యతాయుతంగా పనిచేయడం వల్లే పార్లమెంట్‌లో ఎన్నో అంశాలకు సంబంధించిన బిల్లులు పాసవుతున్నాయని చెప్పారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాలతోపాటు నాలుగో స్తంభంగా మీడియా విశేషంగా పనిచేస్తోందన్నారు.
తెలుగువారిలో రాజకీయ చైతన్యం ఎక్కువని, దీని మూలంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చానళ్లు ఉన్నట్లు భావిస్తున్నానని చెప్పారు. జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికల్లో దక్షిణ భారత వార్తలకి ప్రాధాన్యత ఎందుకు ఉండడం లేదన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ఇంగ్లిష్ పేపర్లకు రాష్ట్రస్థాయి ఎడిషన్లు ఉన్నాయని, ఆయా రాష్ట్రాల ఎడిషన్లు అక్కడి వార్తలను కవర్ చేయడానికి ఉన్నాయని పేర్కొన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం భాషపై పట్టు, ఎలా రాయాలన్న అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర విస్తృతంగా మారిందని చెప్పారు.
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన జర్నలిస్ట్‌లను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బుద్ధవనం ప్రాజెక్ట్ డెరైక్టర్ మల్లెపల్లి లక్ష్మయ్య, హిందూ పత్రిక పూర్వపు సంపాదకులు నగేశ్‌కుమార్, వయోధిక జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి జీఎస్ వరదాచారి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రాజమౌళిచారి, ఎస్. విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు పలు పత్రికల సంపాదకులు పాల్గొన్నారు.