రుణ మాఫీ చేస్తేనే పంట రుణాలిస్తారా?
బ్యాంకుల తీరుపై పోచారం మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘రుణ మాఫీ పూర్తిస్థాయిలో అమలుచేయలేదంటూ మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని ఎస్‌బీహెచ్‌కు చెందిన రెండు బ్రాంచీల్లో పంట రుణాలు ఇవ్వబోమని చెబుతున్నారు. జహీరాబాద్ గ్రామీణ వికాస బ్యాంకులో కూడా పంట రుణాలు ఇవ్వడంలేదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం హామీ ఇచ్చినా... బ్యాంకు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నా కొన్ని బ్యాంకు శాఖలు రైతులకు పంట రుణాలు ఇవ్వకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం... ఆ తర్వాత సచివాలయంలో విలేకరులతోనూ మాట్లాడారు.
ఎస్‌ఎల్‌బీసీలో ఆర్థిక మంత్రి ఈటల కూడా పాల్గొన్నారు. పోచారం మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో రూ.17,460కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు బ్యాంకులు రూ.11,545 కోట్లు ఇచ్చాయన్నారు. ఈ నెలాఖరులోగా మిగిలిన ఖరీఫ్ రుణాలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ శాఖలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖలను విలీనం చేయబోమన్నారు. రుణమాఫీలో మూడో విడతలో మిగిలిన సగం రూ.2,020 కోట్ల నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఈటలను పోచారం కోరారు.