మంత్రి శంకర్ మళ్లీ చిక్కాడు!
37 ఏళ్లలో 24 సార్లు అరెస్టు
228 చోరీ కేసుల్లో నిందితుడు
తాజాగా నాలుగు చోట్ల పంజా
సిటీబ్యూరో: ఘరానా దొంగ మంత్రి శంకర్ మరోసారి చిక్కాడు. గత నెలలోనే జైలు నుంచి బయటకు వచ్చిన ఇతగాడు.. తాజాగా నాలుగు చోట్ల పంజా విసిరాడు. నిందితుడిని అరెస్టు చేసిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.4 లక్షల విలువైన సొత్తు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడకు చెందిన మంత్రి శంకర్ 1979 నుంచి చోరీలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 228 కేసుల్లో నిందితుడిగా ఉండి 24 సార్లు అరెస్టయి జైలుకు వెళ్లాడు. ఐదు కేసుల్లో దోషిగా తేలడంతో న్యాయస్థానం ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. ఇతడిపై చిలకలగూడ ఠాణాలో సిటీ డోషియర్ క్రిమినల్ (సీడీసీ) షీట్ కూడా ఉంది. జంట కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరే ఇతడికి శివన్న, శివప్రసాద్ వంటి మారు పేర్లూ ఉన్నాయి. 1998 నుంచి 2009 వరకు రామంతపూర్‌లోని నేతాజీనగర్‌లో నివసించాడు. 2009 నుంచి తన మకాంను మహారాష్ట్రలోని లాథూర్ జిల్లాలోని ఔసా పట్టణానికి మార్చాడు.
ముగ్గురు భార్యలు, ఏడుగురు సంతానం ఉన్న శంకర్ ప్రస్తుతం మూడో భార్య షాలినితో కలిసి జీవిస్తున్నాడు. ‘సింగిల్ హ్యాండ్’తో నేరాలు చేసే ఇతగాడు ద్విచక్ర వాహనంపై సంపన్నులు నివసించే ప్రాంతాల్లో సంచరిస్తూ రెక్కీ చేస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ప్రధాన ద్వారం పగులగొట్టి లోపలకు ప్రవేశించి సొత్తు ఎత్తుకుపోతాడు. దీన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ జల్సాలు చేస్తాడు. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో చోరీలు చేసిన ఆరోపణలపై 2014లో బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. 2015లో ఉస్మానియా వర్సిటీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించడంతో గత నెలలోనే జైలు నుంచి బయటకు వచ్చాడు. వస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ, బోయిన్‌పల్లి, నాచారంతో పాటు కూకట్‌పల్లిలోనూ నాలుగు నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎల్.భాస్కర్‌రెడ్డి, వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. మంత్రి శంకర్ నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకుని కేసును ఓయూ పోలీసులకు అప్పగించారు.