
కరువు మండలాలపై తీవ్ర నిర్లక్ష్యం
కరువు మండలాల ప్రకటనలో జాప్యం, చాలా మండలాలను గాలికొదిలేయటంతో ఇప్పుడు రైతులు మూల్యం
♦ సర్కార్‌పై సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ధ్వజం
♦ భారం తప్పించుకునేందుకే ‘కరువు’ ప్రకటించలేదు
♦ గత సెప్టెంబర్‌లో హెచ్చరించినా పెడచెవిన పెట్టింది
♦ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి.. రుణమాఫీ ఏకమొత్తంగా అందజేయాలి
♦ తాగునీటికి జిల్లాకు రూ.100 కోట్లు విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: కరువు మండలాల ప్రకటనలో జాప్యం, చాలా మండలాలను గాలికొదిలేయటంతో ఇప్పుడు రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కొన్ని కరువు ప్రభావిత రాష్ట్రాలు సకాలంలో నివేదికలు పంపి కేంద్రంపై ఒత్తిడి చేసి ఎక్కువ నిధులు వచ్చేలా చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నివేదికలు పంపక అతి తక్కువ సాయం రావటానికి కారణమైందని పేర్కొంది. కరువుపై చర్చలో భాగంగా బుధవారం తొలుత ఆ పార్టీ నేత జీవన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్‌లో శాసనసభలో తాము హెచ్చరించినా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం నివేదికలు వెంటనే సిద్ధం చేయలేదన్నారు.
డిసెంబర్ తర్వాత అరకొర వివరాలతో తీరిగ్గా పంపేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. మహారాష్ట్ర రూ.3,050 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.2,030 కోట్లు, కర్ణాటక రూ.1,540 కోట్లు, పశ్చిమబెంగాల్ రూ.1,104 కోట్లు, ఛత్తీస్‌గఢ్ రూ.925 కోట్లు తెచ్చుకుంటే మనకు కేవలం రూ.790 కోట్లు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇక ఇచ్చే అవకాశం లేనందున ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులు సాగునీటికి, పశుగ్రాసం, పశువుల తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నందున రుణమాఫీ ఏకమొత్తంగా అందజేయాలని, ఇందుకు అవసరమైన రూ.4,250 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఉన్నందున జిల్లాకు రూ.100 కోట్లు చొప్పున, పశువుల తాగునీటికి జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున విడుదల చేసి ఆదుకోవాలన్నారు. ఉపాధి హామీ నిధులు దారిమళ్లించి మూడు నెలలుగా కూలీ మొత్తం ఇవ్వటం లేదన్నారు. ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పనిదినాల పరిమితిని తొలగించాలని, ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వటం స్వాగతిస్తున్నా రైతులేం పాపం చేశారని ప్రశ్నించారు. వారికి వచ్చే పంటకాలం నాటికి సరిపోయేలా ఆరు నెలలపాటు నెలకు రూ.5 వేలు చొప్పున కరువు భత్యం ఇవ్వాలని కోరారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కొన్ని జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా వాటిల్లో చాలా మండలాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎస్సారెస్పీలో నీళ్లు లేకున్నా నికర జలాలున్నాయని 19 మండలాలను కరువు మండలాలుగా గుర్తించలేదని ఆరోపించారు.
ఇన్‌పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం కాదు
కరువు మండలాల ప్రకటన తర్వాత ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం కాదని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే పంట కోసం ఇచ్చే ముందస్తు రాయితీ అని, నష్టపోయిన ప్రతి రైతుకు మే నాటికి ఇన్‌పుట్ సబ్సిడీ నయాపైసా సహా ఇస్తామని చెప్పారు. వేరే రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు ప్రకటించినా కంటింజెన్సీ మొత్తంగా కొంతే అందజేసిన విషయాన్ని గుర్తించాలని కోరారు.