సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు రూ.10 కోట్లను దేవాదాయశాఖ కమిషనర్ పేరు
హైకోర్టుకు ఎమ్మెల్యే ఆర్కే నివేదన
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు రూ.10 కోట్లను దేవాదాయశాఖ కమిషనర్ పేరు మీద చెల్లించినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం హైకోర్టుకు నివేదించారు. రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అందజేసిన ఈ నివేదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... మిగిలిన రూ.17.44 కోట్లను చెల్లించేందుకు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ సమయంలో వేలంలో భూములు దక్కించుకున్న వారి తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ... పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తన బినామీల ద్వారా సమకూర్చుకున్న సొమ్మును కమిషనర్ పేరు మీద చెల్లించారని తెలిపారు. 83 ఎకరాల విలువ వెయ్యి కోట్ల వరకు ఉంటుందని పిటిషనర్ చెబుతున్నారని, కాబట్టి అతన్ని రూ.500 కోట్లయినా డిపాజిట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిని నిర్ద్వందంగా తోసిపుచ్చింది.