
హోదాపై దీక్షకు సిద్ధమా?
చంద్రబాబుకు ముద్రగడ సవాల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా డిమాండ్‌తో తనతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం కావాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. తనవి దొంగ దీక్షలని సీఎం వందిమాగధులతో పదేపదే చెప్పిస్తున్నారన్నారని, దొంగ దీక్ష అయితే తనను బంధించిన ఆస్పత్రిలో పెద్ద ఎత్తున పోలీసులను ఎందుకు కాపలా పెట్టారని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎంకు రాసిన లేఖ ప్రతులను ఆదివారం ఆయన ఇక్కడ పత్రికలకు విడుదల చేశారు. ‘తనవి దొంగదీక్షలని చెప్పిస్తున్న సీఎం.. తుని గర్జన లాంటి మరో సభను తమ జాతితో కిర్లంపూడిలో జరిపించాలని ముద్రగడ సవాల్ విసిరారు.
అదే జరిగితే తన కుటుంబం కట్టుబట్టలతో రాష్ట్రం విడిచి పోతుందని, అప్పుడు తమ ఆస్తులు, అప్పులు తీసుకుని అనుభవించాలని సూచించారు. తుని ఐక్యగర్జన సభకు ఎవరికి వారే వాహనాలు ఏర్పాటు చేసుకున్నార ని, తిండి, తాగునీరు కూడా వారే తెచ్చుకున్నారని స్పష్టం చేశారు. కానీ మీరు సీబీసీఐడీ అధికారులతో ‘గర్జన సభ పెట్టడానికి డబ్బు ఎవరిచ్చారు? వెనుక జగన్ ఉన్నారా ? మోదీ, సోనియాగాంధీ ఉన్నారా?’ అని అడిగిస్తున్నారన్నారు.
గతంలో సినీ నటుడు బాలకృష్ణ మరొకరి పేరుతో ఉన్న రివాల్వర్ పేల్చిన సందర్భంలో చంద్రబాబు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకుని కాపాడమని వేడుకున్నారని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. బాలకృష్ణ ఒక్క గంట కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా, అరెస్టు కాకుండా ఉన్నారంటే అది వైఎస్ పుణ్యమేనని తెలిపారు.
ముద్రగడ పర్యటన మళ్లీ వాయిదా: ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది.వర్షాలవల్ల పర్యటన వాయిదా పడినట్టు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ఆకుల రామకృష్ణ హైదరాబాదులో ఒక ప్రకటన ద్వారా తెలిపారు.