=కెడిట్ కార్డు తరహాలో కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు
=అందుబాటులో 16 రకాల సేవలు
=రీచార్జీ ఆప్షన్ కూడా...
=హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ రూపకల్పన
=ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌తోనూ అనుసంధానం
=ఆధునిక పద్ధతిలో టికెటింగ్
=2015 నుంచి అందుబాటులోకి!
సాక్షి, సిటీబ్యూరో: క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డు.. పెట్రో కార్డు.. ఈ వరసలో కొత్తగా చేరనుంది ‘కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు (సీఎస్‌సీ)’. హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్ అండ్ టీ ఈ బహుళ ప్రయోజనకార్డును అందుబాటులోకి తేనున్నాయి. నగరవాసుల వాలెట్‌లోకి కొత్తగా చేరనున్న ఈ కార్డు.. సెల్‌ఫోన్‌లో ప్రీపెయిడ్ రీచార్జి తరహాలో ఒక్కసారి టాప్‌అప్ చేస్తే అందులో డబ్బులు అయిపోయే వరకు మెట్రోలో తిరగొచ్చు. మాల్స్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా బ్యాంకులకు నగదు బదిలీ చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడొచ్చు. ఇలా 16 రకాల సేవలను వినియోగించుకోవచ్చు. బహుళ ప్రయోజన కార్డుగా రాబోతున్న ఈ సీఎస్‌సీని తొలివిడత మెట్రోరైలు పట్టాలపైకి వచ్చే 2015 ఉగాది నాటికే అందుబాటులోకి తెచ్చే యోచనలో మెట్రోరైలు, ఎల్‌అండ్‌టీ అధికారులున్నారు.
మెట్రో... ప్రజల జీవన గమనం
‘మెట్రోరైలు కేవలం ప్రయాణం కోసమే కాదు... నగర ప్రజల జీవితంలో ఓ భాగం’.. ఇది జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ చెబుతున్న మాట. ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్న అధికారులు స్మార్ట్ కార్డులనూ ఇందులో భాగంగానే తెరపైకి తెస్తున్నారు. ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి పాకెట్‌లో పైసా లేకుండా నగరమంతా తిరిగి అవసరమైన షాపింగ్ చేసుకొని హాయిగా ఇంటికి చేరుకునే తరహాలో హెచ్‌ఎంఆర్ ఈ కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డును రూపొందిస్తోంది. ఇందులో రూ.వెయ్యి రీచార్జీ చేసుకుంటే మెట్రో ప్రయాణంతో పాటు క్రెడిట్ కార్డును ఉపయోగించుకున్నట్టే 16 రకాల సేవలకు దీన్ని వినియోగించుకోవచ్చని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
కార్డులు.. టోకెన్లు..
మెట్రోరైలులో ప్రయాణించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీ) ద్వారా టికెటింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నారు. దీనికి మూలం కాంటాక్ట్‌లెస్ ఫేర్ మీడియా టెక్నాలజీ అని హెచ్‌ఎంఆర్ చెబుతోంది. శామ్‌సంగ్ కంపెనీకి ఈ బాధ్యతను ఇప్పటికే అప్పగించారు. ఈ విధానంలో టికెట్ తనిఖీ ఇతరత్రా పనులన్నీ సెన్సర్లు, మిషన్ల ద్వారా జరిగిపోతాయి. ఏఎఫ్‌సీ టికెట్ల జారీ రెండు రకాలు..
కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు (సీఎస్‌సీ): ఇందులో మళ్లీ రెండు రకాలు.. కేవలం మెట్రో రైలు పాస్‌గానే ఉపయోగించుకోవచ్చు. ‘ఈ-పర్స్’ గానూ వినియోగించుకోవచ్చు. దీని ద్వారా వివిధ రకాలైన 16 సేవలు పొందవచ్చు.
కాంటాక్ట్ లెస్ స్మార్ట్ టోకెన్ (సీఎస్‌టీ): టోకెన్ అంటే, రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికి ముందు తీసుకునే టికెట్. దీన్ని అవసరమైతే రానుపోను కూడా ఒకేచోట కొనుగోలు చేయవచ్చు. టోకెన్ అంత వరకే ఉపయోగపడుతుంది.
ఏఎఫ్‌సీ విధానంలో లభించే మెట్రో పాస్‌ల సేవలు
ఎలక్ట్రానిక్/స్టోర్డ్ వాల్యూ పర్స్(ఈ-పర్స్) పాస్ అంటే స్మార్ట్ కార్డు అన్నమాట. దీంతో పాటు టూరిస్ట్ పాస్, ట్రిప్ పాస్, డైలీ పాస్, వీక్లీ పాస్, మంత్లీ పాస్, హాలిడే పాస్‌లు కూడా ఏఎఫ్‌సీ విధానంలో మెట్రోరైలు అందించనుంది. సిటీబస్సుల్లో పాస్‌లతో ఉద్యోగాలకు వెళ్లే వారు కూడా మెట్రోరైలు అందించే పాస్‌లనూ వినియోగించుకోవచ్చు. ఉద్యోగులకు ఆర్టీసీ తరహాలో రాయితీ ఇచ్చే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పటి డిమాండ్, మార్కెట్ లెవల్‌ను బట్టి రాయితీలిచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.
మల్టీపర్పస్.. మెట్రో ఈ-పర్స్
Published Sun, Nov 17 2013 4:53 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement