సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగిలిన 73 నగర, పురపాలక సంస్థల పరిధిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. రెండు వారాల కిందే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నా, పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నద్ధమైంది. తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయనున్నారు. కనెక్షన్ కోసం కావాల్సిన పైపులతో పాటు రోడ్డు తవ్వకాల వ్యయాన్ని సైతం స్థానిక పురపాలికలే భరిస్తాయి.