రూపాయి కొట్టు.. నల్లా పట్టు
♦ సిద్దిపేటలో రేపటి నుంచే కనెక్షన్లు
♦ నేటి నుంచి వార్డుల్లో మేళాలు
♦ 7 వేల నూతన కనెక్షన్ల లక్ష్యం
♦ 1,670 అక్రమ నల్లాల గుర్తింపు
♦ క్రమబద్ధీకరణకు చర్యలు
సిద్దిపేట జోన్: మున్సిపాలిటీలో రూపాయికే నల్లా కనెక్షన్.. బుధవారం నుంచే అమలు.. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం.. సిద్దిపేట మున్సిపల్ అధికారులు మంగళవారం నుంచి వార్డుల్లో దరఖాస్తులను స్వీకరించేందుకు మేళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ రమణాచారి ప్రణాళిక బద్ధంగా వార్డు సభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా పట్టణంలోని ఆయా వార్డుల్లో 1,670 అక్రమ నల్లాలున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా విలీన గ్రామాల్లో అక్రమ నల్లాలు అధికంగా ఉన్నట్లు సర్వేలో తెలింది.
ప్రభుత్వం రూపాయికే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో మిషన్ భగీరథకు అనుసంధానంగా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చే ప్రక్రియను చేపట్టారు. సిద్దిపేటలోని మున్సిపల్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం 13 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఆరు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో 1670 నల్లా కనెక్షన్‌లు రికార్డుల్లో లేనట్లుగా సర్వేలో తెలింది. ప్రభుత్వ ఆశయం మేరకు రూపాయికే బడుగు బలహీన వర్గాలకు నల్లా కనెక్షన్ అందించేలా సిద్దిపేట అధికారులు చర్యలు చేపడుతున్నారు. అక్రమమైన వాటిని క్రమబద్దీకరిస్తూ మరో 7 వేల నూతన నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించారు.
క్రమబద్ధీకరణకు మార్గం
సిద్దిపేట పట్టణంతో పాటు ఆరు విలీన గ్రామాల్లో కొన్నేళ్లుగా రికార్డులకు ఎక్కని నల్లాలను క్రమబద్ధీకరించేందుకు మార్గం సుగమం చేశారు. ప్రతి నెలకు 150 చొప్పున యేడాది పొడవునా 12 నెలలకు కలిపి రూ. 1800 చెల్లిస్తే అక్రమ నల్లాను క్రమబద్ధీకరించే అవకాశముంది. అందుకు మంగళవారం నుంచి జూన్ 5 వరకు పట్టణంలోని 34 వార్డుల్లో సభ లు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏఈ, ఆర్‌ఐ, లైన్‌మెన్, బిల్ కలెక్టర్లతో కూడిన కమిటీ రోజూ ఉదయం 8 గంటలకు, 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు చొప్పున మూడు వార్డుల్లో మేళాలు నిర్వహించనుంది. ఈ సభల్లో అక్రమ నల్లా క్రమబద్ధీకరణతోపాటు, రూపాయికే నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు, భగీరథ కింద ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన నూతన పైపులైన్ నిర్మాణం ప్రతిపాదనలను స్వీకరించనున్నారు. ప్రతి ఇంటికి ఒకే నల్లా ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఒక ఇంట్లో రెండు ఉంటే ఒకటి తొలగించనున్నారు.