ఛత్తీస్గఢ్లో నయీమ్గ్యాంగ్ డెన్లు!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఇతర రాష్ట్రాల్లో సృష్టించిన ఆగడాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆస్తులు, భూ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ నయీమ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కస్టడీలో ఉన్న నయీమ్ వంట మనిషి ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్సా, ఫయీమ్, అతని భార్య షాహిన్‌లను సిట్ అధికారులు ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఇది వరకే గుర్తించిన రెండు డెన్‌లలో సోదాలు నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ కూడా పెద్ద మొత్తంలో భూ డాక్యుమెంట్లు, ఇళ్ల స్థలాలు, అత్యాధునిక ఆయుధాలు బయటపడినట్లు పోలీసు వర్గాల సమాచారం.
అక్కడి సంబంధాలపై ఆరా..!
ఛత్తీస్‌గఢ్‌లో నయీమ్ ఏం చేసేవాడనే దానిపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఎందుకు వచ్చేవాడు, ఎవరెవరిని కలిసే వాడనే విషయం మీద దృష్టి కేంద్రీకరించారు. అక్కడ కూడా నయీమ్ ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసినట్లు డెన్‌లలో లభించిన ఆధారాల ద్వారా వెల్లడైనట్లు తెలిసింది. వాటిని గుర్తిం చేందుకు స్థానిక పోలీసుల సహకారంతో సిట్ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.