నయీమ్ అలియాస్ జేమ్స్
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మరో పేరు కూడా ఉందా..? ఛత్తీస్‌గఢ్‌లో జేమ్స్ అనే పేరుతో నయీమ్ చలామణి అయ్యాడా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నా రు సిట్ అధికారులు. ఆడవేషాలు, బుర్ఖాలు, ముసుగులతో ఎప్పుడూ సంచరించే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు భావిస్తున్నారు. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బెదిరింపులు, భూ ఆక్రమణలు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన నయీమ్ ఈ నెల 8న ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులు నయీమ్‌కు జేమ్స్ అనే మరో పేరు కూడా ఉన్నట్టు గుర్తించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీస్ ఇన్ఫార్మర్‌గా ఉపయోగపడ్డ నయీమ్.. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ పోలీసులకు దగ్గరయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి నయీమ్‌ను ఉపయోగించుకోవాలని అక్కడి పోలీసులు భావించారు. శత్రువులకు చిక్కకుండా ఉండటానికి అప్పుడే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు తెలిసింది.
భువనగిరిలో సిట్ విచారణ
నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో నయీమ్ అనుచరులు, సన్నిహితులపై సిట్ నిఘా పెట్టింది. సిట్ అధికారులు గురువారం భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు.
వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్యవర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. భువనగిరి గంజ్‌లోని ఓ ప్రముఖ యువ వ్యాపారి, వాహనాల కాంట్రాక్టర్‌ను సిట్ అధికారులు విచారించారు. కొందరిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.
రిజిస్ట్రేషన్ అధికారిపై నిఘా
భూములు, భవనాలను నయీమ్ గ్యాంగ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఓ అధికారిపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. నయీమ్‌కు సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు ఈ అధికారి ద్వారా ఎక్కువగా జరిగినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఇతను ప్రస్తుతం అధికారి హోదాలో ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. వివాదాలెన్ని ఉన్నా నిబంధనలను తుంగలో తొక్కి నయీమ్, అతని అనుచరులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఇతను కీలకపాత్ర పోషించాడని సిట్ గుర్తించింది.