సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో కొత్త జిల్లాలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్థానిక అవసరాలు, ప్రజల డిమాండ్లు, నేతల ఒత్తిళ్ల కారణంగా 31 జిల్లాలు ఏర్పాటు చేసినా.. పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని నిర్ధారణకు వచ్చింది. అలా అదనంగా ఏర్పాటు చేసిన జిల్లాలను చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో విలీనం చేయాలని యోచిస్తోంది. ఇదే సమయంలో సమర్థవంతమైన పాలన అందించేందుకు అవసరమైన కొత్త జిల్లాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని భావిస్తోంది. ప్రధానంగా వరంగల్ రూరల్ జిల్లాను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా అధికారులతో చర్చించినట్లు సమాచారం. త్వరలోనే ఈ జిల్లాకు మంగళం పాడే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా అంగీకరిస్తున్నాయి.
ఎన్నో సమస్యలు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు పాత పది జిల్లాలను పునర్వ్యవస్థీకరించేందుకు భారీగా కసరత్తు చేసింది. 2016లో దసరా పండుగ రోజున 31 జిల్లాలతో కొత్త పరిపాలనా ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది. కానీ ఒక్కసారిగా జిల్లాల సంఖ్య బాగా పెరగటంతో ఉద్యోగుల సర్దుబాటు, అధికారుల నియామకం తలనొప్పిగా మారింది. ఏడాది ముగిశాక కొత్త జిల్లాలతో ఒనగూరిన ప్రయోజనాలపై ప్రభుత్వం విశ్లేషణ జరిపింది. ఈ సమయంలోనే వరంగల్ రూరల్ జిల్లా అనవసరమనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తపరిచినట్లు తెలిసింది. వాస్తవానికి పాత వరంగల్ జిల్లా ఐదు జిల్లాలుగా విడివడి... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం జిల్లాలు ఏర్పడ్డాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలు కలిసున్న చోట.. వరంగల్ అర్బన్, రూరల్ పేరిట రెండు జిల్లాలు ఎందుకన్న సందేహంతో ప్రభుత్వం తొలుత మల్లగుల్లాలు పడింది.
కానీ చివరి దశలో రెండు జిల్లాలకు ఓకే చెప్పింది. అయితే చారిత్రక ప్రాధాన్యమున్న హన్మకొండ పేరును పరిగణనలోకి తీసుకోకుండా.. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా పేరు పెట్టడంతోనే వివాదం మొదలైంది. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రభుత్వ నాన్చివేత ధోరణి దానికి ఆజ్యం పోసింది. గీసుకొండ మండలం మొగిలిచర్లలో కలెక్టరేట్ ఏర్పాటుకు ఉచితంగా భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. ఆ భూమి రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పరకాల, వర్ధన్నపేట ప్రాంతాల ప్రజలు, నాయకులు దానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమ వద్ద అంటే తమ వద్ద జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రాంతాల ప్రజలు, నేతలు పట్టుబట్టారు. అధికారులు ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. ‘జిల్లా నేతల్లో ఏకాభిప్రాయం లేనప్పుడు.. అసలు ఆ జిల్లానే ఎత్తివేస్తే మంచిది’అని అభిప్రాయపడ్డట్లు తెలిసింది. అందులో భాగంగానే వరంగల్ అర్బన్ కలెక్టర్‌కే రూరల్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారని చెబుతున్నారు.
ఆ జిల్లాలు ఉంచాలా.. వద్దా?
రాష్ట్రంలో అదనంగా ఏర్పాటు చేసిన పలు కొత్త జిల్లాలను కొనసాగించాల్సిన అవసరం ఉందా అని ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అటవీ, గిరిజన, చారిత్రక, ఆధ్మాత్మిక, ఆర్థిక ప్రాధాన్యతల దృష్ట్యా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే చివరి దశలో నేతల ఒత్తిళ్లతో తెరపైకి వచ్చిన కొత్త జిల్లాలు చిక్కులు తెచ్చిపెట్టాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు అత్యంత సమీపంలోనే జనగాం జిల్లాను ఏర్పాటు చేయటం... మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలను అవసరం లేకున్నా ఎక్కువ జిల్లాలుగా విడగొట్టడంపై విమర్శలున్నాయి. గుండాల మండలాన్ని జనగాం జిల్లాలో చేర్చడంపై అక్కడి ప్రజాప్రతినిధులు ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు.
జఫర్‌గఢ్ మండలాన్ని జనగాంలో చేర్చటంపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జనగాం, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి తదితర జిల్లాలను కొనసాగించాలా..?, వాటిలో కొన్నింటిని ఎత్తివేయాలా..? అన్న దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికీ జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జరుగుతున్న ఆందోళనలు, అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అధికారులను, పార్టీ ముఖ్య నేతలను ముఖ్యమంత్రి పురమాయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment