జిల్లాలు 24 | trs proposes 24 districts for telangana state | Sakshi
Sakshi News home page

జిల్లాలు 24

Published Fri, May 9 2014 1:42 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

జిల్లాలు 24 - Sakshi

జిల్లాలు 24

టీఆర్‌ఎస్ ప్రతిపాదిత కొత్త జిల్లాలు..


 1. సిద్దిపేట, 2. మెదక్, 3. మహబూబ్‌నగర్, 4. వనపర్తి, 5. నాగర్‌కర్నూలు, 6. నల్లగొండ,
 7. సూర్యాపేట 8. ఖమ్మం, 9. భద్రాచలం, 10. ఆదిలాబాద్, 11. మంచిర్యాల, 12. వరంగల్, 13. జనగాం, 14. ఆచార్య జయశంకర్ జిల్లా(భూపాలపల్లి), 15. జగిత్యాల, 16. కరీంనగర్, 17. నిజామాబాద్, 18. రంగారెడ్డి(జిల్లా కేంద్రం వికారాబాద్), 19. హైదరాబాద్ సెంట్రల్, 20. చార్మినార్, 21. గోల్కొండ, 22. హైదరాబాద్ ఈస్ట్ (జిల్లా కేంద్రం భువనగిరి),
 23. సికింద్రాబాద్, 24  సంగారెడ్డి
 
 తెలంగాణలో జిల్లాల పెంపుపై టీఆర్‌ఎస్ కసరత్తు
 పది జిల్లాలను 24కు పెంచేందుకు ప్రణాళికలు
 రాజధానిపై ఒత్తిడి తగ్గేలాజిల్లాల పునర్వ్యవస్థీకరణ
 హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే 6 జిల్లా కేంద్రాలు
 జిల్లాకు 5 నియోజకవర్గాలు, సగటు జనాభా 15 లక్షలు
 పూర్తి స్థాయిలో  మౌలిక సదుపాయాల కల్పన
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్.. కొత్త రాష్ర్టంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తును కూడా పూర్తి చేసింది. నిత్యం కిటకిటలాడే రాజధాని హైదరాబాద్‌ను వాహనాల రద్దీ నుంచి విముక్తం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న టీఆర్‌ఎస్ నాయకత్వం ఈ అంశంపై నిర్దిష్టమైన అవగాహనకు వచ్చింది. ఏయే కేంద్రాలను జిల్లాలుగా మార్చాలి.. వాటిలో ఏయే నియోజకవర్గాలు ఉండాలనే దానిపై నిపుణులతో పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దీని ప్రకారం తెలంగాణలో ఇప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించింది. 23 జిల్లాల్లో ఐదేసి నియోజకవర్గాలు, ఆచార్య జయశంకర్ పేరుతో ఏర్పాటయ్యే జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండాలని ప్రతిపాదించింది. జనాభాను, భౌగోళిక స్థితిని బట్టి చార్మినార్, వికారాబాద్, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌ల పరిధిలో నియోజకవర్గాల సంఖ్యను సర్దుబాటు చేయాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజన(2019లోగా తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాల్సి ఉంది)ను దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందనే వాదన కూడా ఉంది.


 జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదికలివే..


 దేశవ్యాప్తంగా జిల్లాల సగటు జనాభా 19 లక్షలుగా ఉంది. ప్రస్తుత ఉమ్మడి రాష్ర్టంలో ఈ సగటు దాదాపు 30 లక్షలు. కొన్ని మండలాల ప్రజలు తమ జిల్లా కేంద్రంకన్నా.. రాష్ట్ర రాజధానికి వెళ్లడమే సులభంగా ఉన్న పరిస్థితి నెలకొంది. విద్య, వైద్యం వంటి అవసరాలకు అన్ని జిల్లాల వారూ హైదరాబాద్‌కే రావాల్సి వస్తోంది. అందుకని జిల్లాలను పెంచి, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సకల వసతులను ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల ప్రపంచస్థాయి(గ్లోబల్ సిటీ) నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకునే వీలుంటుంది. ఈ ప్రాతిపదికతోనే తెలంగాణలోని జిల్లాలను 15 లక్షల సగటు జనాభాతో ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ యోచిస్తోంది.
 
 జిల్లా కేంద్రాలకు వెయ్యి కోట్లు అవసరం


 తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాల ప్రతిపాదనలపై విస్తృత చర్చలు చేపట్టాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. పార్టీ నేతలు చెబుతున్న దాని ప్రకారం 2016 నాటికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిమ్స్ స్థాయి ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, అన్ని సంస్థల సిబ్బందికి క్వార్టర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి వెయ్యి కోట్ల  రూపాయల చొప్పున నిధులు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడున్న జిల్లా కేంద్రాలకు అదనంగా 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అందుకు రూ. 14 వేల కోట్లు అవసరం. కొత్త జిల్లా కేంద్రాల్లో పాలనా ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి దాదాపుగా రెండు లేదా మూడేళ్లు పడుతుందని అంచనా.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement