
కేసు పెడితే అంతు చూస్తాం...
తప్పతాగి బైక్‌లు నడుపుకుంటూ వస్తున్న ఆరుగురు నైజీరియన్లను పోలీసులు పట్టుకోగా... కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు పోలీసులను హెచ్చరించడంతో పాటు దుర్భాషలాడారు.
* తప్పతాగి డ్రైవింగ్
* పోలీసులపై నైజీరియన్ల దౌర్జన్యం
బంజారాహిల్స్: తప్పతాగి బైక్‌లు నడుపుకుంటూ వస్తున్న ఆరుగురు నైజీరియన్లను పోలీసులు పట్టుకోగా... కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు పోలీసులను హెచ్చరించడంతో పాటు దుర్భాషలాడారు. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై నైజీరియన్లు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద శనివారం రాత్రి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంకన్ డ్రైవ్’ తనిఖీలు చేపట్టారు.
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఆరుగురు నైజీరియన్లు పోలీసులకు పట్టుబడ్డారు. తమపై కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కి.. బూతులు తిట్టారు. అంతే కాకుండా బైకులు తీసుకొని పరారయ్యేందుకు యత్నించారు. ఈ దృశ్యాలను చిత్రీకరించబోయిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడి దాడి చేశారు. కెమెరాలు ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఇంతలో చేరుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా... శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 20 బైకులు, 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల వ్యవధిలో నిర్వహించిన డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 76 కేసులు నమోదు చేశారు.