నిమ్స్‌లో ప్రసూతి విభాగం!
రూ. 100 కోట్లతో 500 పడకల ఏర్పాటు?
వైద్యారోగ్యశాఖ యోచన సీఎంకు ప్రతిపాదించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో ప్రసూతి ఆస్పత్రి లేకపోవడం, సాధారణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటంపై వైద్యారోగ్యశాఖ దృష్టిపెట్టింది. ఈ సమస్యను అధిగమించేందుకు నిమ్స్‌లో 500 పడకలతో ప్రత్యేకంగా ప్రసూతి విభాగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీని ఏర్పాటుకు రూ. 100 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేస్తోంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిమ్స్ ఇప్పటివరకు గుండె, కిడ్నీ వైఫల్యం వంటి చికిత్సలకే ఎక్కువగా పరిమితమైందని...ప్రసూతి ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ప్రజల నుంచి భారీ స్పందన ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 6.5 లక్షల ప్రసవాలు జరుగుతున్నట్లు అంచనా ఉండగా అందులో దాదాపు 2 లక్షల వరకు ప్రసవాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఫీజు రూ. 30 వేల లోపే...
నిమ్స్‌లో ప్రసూతి ఆస్పత్రి విభాగాన్ని ఏర్పాటు చేస్తే తక్కువ ధరకే ప్రసవాలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు రూ. 50 వేల నుంచి రూ. లక్షన్నర వరకు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిమ్స్‌లో రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకే ప్రసవాలు చేసే అవకాశం ఉందని నిమ్స్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులు కాసుల కోసం అవసరం ఉన్నా లేకున్నా గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయని...దీన్ని దృష్టిలో ఉంచుకొని సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా ఏర్పాట్లు చేయాలని నిమ్స్ భావిస్తోంది. ప్రసవాలకు వచ్చే గర్భిణుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మానసిక వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలనుకుంటోంది.