
గత పాలకుల తీరే ‘పాలమూరు’కు శాపం
రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదని, వారి పాలనే ప్రాజెక్టులకు శాపమైందని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను ముంచే పులిచింతలకు సహకరించింది ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలే అని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు. పులిచింతల ప్రాజెక్టును వ్యతిరేకించిన నాయకులే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోలీసులను పెట్టించి మరీ ఆ ప్రాజెక్టును పూర్తి చేయించారని వివరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు నష్టం లేదని ఒక దినపత్రికలో వ్యాసం రాశారని.. తాను వ్యాసం రాసినట్లు నిరూపిస్తే చిన్నారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారన్నారు. పోతిరెడ్డిపాడు కట్టాలని ఆయన 2007 జనవరి 20వ తేదీన వ్యాసం రాశారని, ఆ వ్యాసం ప్రతిని విలేకరుల సమావేశంలో చూపెట్టారు.