'ఆ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు'
హైదరాబాద్: శాశనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి పేర్కొన్నారు. ఆ అగంతకులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్‌ఎస్‌కు కూడా ప్రమేయం ఉందని భావించాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీల గెలుపు కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను బెదరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్నదే టీఆర్‌ఎస్ అజెండాగా ఉందని విమర్శించారు.
టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక విధానాలు పరాకాష్టకు చేరాయని దుయ్యబట్టారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఆగడాలపై కోర్టులను ఆశ్రయించామని ఉత్తమ్, జానా తెలిపారు. టీఆర్‌ఎస్ బెదిరింపులకు కాంగ్రెస్ కేడర్ భయపడదని ఘాటుగా సమాధానమిచ్చారు. టీఆర్‌ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కేడర్ సిద్ధంగా ఉండాలని ఉత్తమ్, జానారెడ్డి పిలుపునిచ్చారు. కాగా, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లడితే చంపుతామని ఫోన్లో బెదరిస్తున్నట్టు శుక్రవారం షబ్బీర్‌అలీ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.