పత్తి వద్దు... | No to cotton | Sakshi
Sakshi News home page

పత్తి వద్దు...

Published Mon, Apr 25 2016 3:04 AM | Last Updated on Mon, Oct 1 2018 5:09 PM

పత్తి వద్దు... - Sakshi

పత్తి వద్దు...

రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, ధర పడిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని రైతులను, అధికారులను అప్రమత్తం చేశారు.

ధర పడిపోయే ప్రమాదం ఉంది: ముఖ్యమంత్రి కేసీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, ధర పడిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని రైతులను, అధికారులను అప్రమత్తం చేశారు. పత్తి ఎగుమతి సుంకం పెంచడంతో పాటు, ఎగుమతులపై విధించే పన్ను రాయితీని రద్దు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఈ ప్రభావం తెలంగాణ రైతులపై పడకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా పత్తి ధరలు పడిపోతున్నాయి. దేశీయ మార్కెట్లో కూడా ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. వీటితో సంబంధం లేకుండా రైతులు పెద్దఎత్తున పత్తి సాగు చేస్తున్నారు.

అధిక పెట్టుబడి పెట్టి సరైన ధర రాక నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి ఎగుమతి సుంకాన్ని పెంచేలా నిర్ణయం తీసుకుంది. పత్తి ఎగుమతులపై విధించే పన్నులో రాయితీని రద్దు చేసే అంశంపై నైరోబీలో జరిగిన డబ్ల్యూటీవో సదస్సులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకం కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పత్తి మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది..’’ అని సీఎం అన్నారు. పత్తి పంటపై సీఎం కేసీఆర్ ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం, రైతులకు చేయాల్సిన సూచనలు, ప్రభుత్వ కార్యాచరణ తదితర అంశాలపై ఈ నెల 29న జరిగే కలెక్టర్ల సదస్సులో కూలంకషంగా చర్చించనున్నారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొని విసృ్తత చర్చ జరిగేలా చూడాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సీఎం సూచించారు.

 ఖరీఫ్‌లో సగం పత్తే..
 పత్తిపై సీఎం స్వయంగా చేసిన హెచ్చరికలు రైతు గుండెలను పిండేస్తోంది. 2015-16 ఖరీఫ్‌లో రాష్ట్రంలో సాగైన వివిధ పంటల విస్తీర్ణంలో దాదాపు సగ భాగం పత్తి పంటే ఉంది. దాదాపు 42.42 లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి ఏకంగా 104 శాతం విస్తీర్ణంలో పత్తి వేయడాన్ని చూస్తుంటే రైతులు ఈ పంటపై పెంచుకున్న ఆశకు అద్దం పడుతోంది. వరి సాగు విస్తీర్ణానికి మూడింతలు ఎక్కువగా పత్తి పంట వేశారు. కానీ తీవ్ర వర్షాభావ పరిస్థితులు పత్తి రైతులతో చెలగాటమాడాయి. రాష్ట్రంలో దాదాపు 80 శాతం వరకు పత్తి ఎండిపోయింది. దిగుబడి భారీగా తగ్గిపోయింది. మరోవైపు క్వింటాలు పత్తికి రూ. 4,100 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం పత్తి కొనుగోలుకు అంతగా ఆసక్తి చూప డం లేదు. దీంతో అసలు సీజన్లో పత్తి రేటు పడిపోయింది. వ్యవసాయ మార్కెట్లలో దళారులు, వ్యా పారులు నిర్ణయించిన రేట్లకు అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తింది. రాష్ట్రంలో సగటున పత్తి క్వింటాలుకు రూ.3500 ధరకు మించి రాలేదు.
 
 ఆ ఒప్పందం పిడుగుపాటే..
 తెలంగాణలో మొత్తం 55.53 లక్షల మంది రైతులున్నారు. వారిలో దాదాపు 25 లక్షల మంది రైతులు పత్తి సాగుపై ఆధారపడ్డారు. డబ్ల్యూటీవో ఒప్పందం మేరకు పత్తి ఎగుమతులకు ఇచ్చే పన్ను రాయితీలు రద్దు చేస్తే ప్రతికూల పరిస్థితులుంటాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఏటా 325 లక్షల బేళ్ల పత్తి (ఒక బేల్ అంటే 170 కిలోల దూది) ఉత్పత్తి అవుతుంది. అందులో దేశీయ అవసరాలకు 260 లక్షల బేళ్లు వినియోగించినా.. మిగతా 65 లక్షల బేళ్లు ఎగుమతి అవుతాయి. తాజా నిర్ణయంతో పత్తి ఎగుమతులు నిలిచిపోయి, నిల్వలు భారీగా పెరిగిపోయి రేట్లు పడిపోతాయి. పత్తి ఉత్పత్తి ఎక్కువగా ఉన్న దేశాలకు డబ్ల్యూటీవో ఒప్పందం అశనిపాతం లాంటిదేనని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement