
ఈ పనుల్లోనూ ‘నామినేషన్’!
కృష్ణా పుష్కరాల పనులపై ఉద్దేశపూర్వకంగానే జాప్యం
ఆఖరి నిమిషంలో టీడీపీ నేతలకు అప్పగించే ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల పనులను నామినేషన్ విధానంలో అధికార పార్టీ నేతలకు కట్టబెట్టిన ప్రభుత్వం కృష్ణా పుష్కరాల్లోనూ అదే తరహా విధానానికి తెరతీసింది. ఆగస్టు 12 నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాల పనుల అంచనాను పెంచి, నామినేషన్‌పై అప్పగించేందుకు స్కెచ్ వేసింది. పుష్కరాలకు మరో 6నెలలే గడువు మిగిలి ఉంది. ఈపనుల్లో పారదర్శకత పాటించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వీటిని ఇప్పటికే టెండర్ విధానంలో అప్పగించేవారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రూ. 2,200 కోట్లతో ప్రతిపాదనలు
కృష్ణా పుష్కరాలు జరగనున్న కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొత్తం రూ.2,200 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చింది. రోడ్ల నిర్మాణాలకు అంచనాలను రూపొందించింది. గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణా పుష్కరాల నిర్వహణలోనూ సింహభాగం పనులను ఆర్‌అండ్‌బీకే అప్పగించనున్నారు. గోదావరి పుష్కరాల్లో రూ.1,600 కోట్లతో ముందుగా అంచనాలు సిద్ధం చేశారు. పనులు ప్రారంభమయ్యే నాటికి వాటిని రూ.1,800 కోట్లకు పెంచేశారు.ఉభయగోదావరి జిల్లాల్లో రూ.1,800 కోట్లు ఖర్చు చేయగా, మూడు జిల్లాల పరిధిలో జరిగే కృష్ణా పుష్కరాలకు కనీసం రూ.2,000 కోట్ల మేర ఖర్చు ఉంటుందని ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, దేవాదాయ శాఖల అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో ఆర్‌అండ్‌బీకి రూ.650 కోట్ల వరకు కేటాయించారు.