
వీధివీధిలో కంపు
ఎక్కడి చెత్త అక్కడే
కంపుకొడుతున్న రహదారులు, కాలనీలు
నేటినుంచి కార్మికుల సమ్మె తీవ్రతరం
ముషీరాబాద్/కవాడిగూడ,న్యూస్‌లైన్: కనీస వేతనం రూ.16,500, మధ్యంతరభృతి ఇవ్వాలని,ఉద్యోగులకు ఆరోగ్య కార్డులివ్వాలన్న తదితర డిమాండ్లతో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకపోయింది. గతవారం రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మెతో వీధులన్నీ కంపుకొడుతున్నాయి.
గుట్టలుగుట్టలుగా చెత్త పేరుకపోవడంతో దాన్ని తీసేవారే కరువయ్యారు. కాగా పారిశుద్ద్య కార్మికులు గత వారంరోజులుగా సమ్మె చేస్తుంటే... నేటి నుంచి అదే సమస్యపై మరో పది కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. కాకుంటే కనీస వేతనం ఎంత ఉండాలనే అంశంపై ఈ సంఘాల మధ్య వ్యత్యాసం ఉంది. టీఆర్‌ఎస్ అనుబంధ కార్మికసంఘం రూ.16,500 కనీస వేతనం ఉండాలంటుంటే..సీఐటీయూ, ఇతర సంఘాలు రూ.12,500 ఉండాలనిడిమాండ్ చేస్తున్నాయి.
భారీ ర్యాలీ
మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తా నుంచి వీఎస్టీ వరకూ పారిశుద్ధ్య కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ వేతనాలు పెంచుతామని, డీఏ, మధ్యంతరభృతి, పార్ట్‌టైం స్వీపర్లను పూర్తికాలం కార్మికులుగా గుర్తిస్తామని జీవో విడుదల చేసి ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటినుంచి 10 కార్మిక సంఘాలతో కలిసి సమ్మెను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. 12న మున్సిపల్ కార్మికుల గర్జన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహిస్తామని ప్రకటించారు.