ఓయూలో గాల్లో లేచిన పోలీసుల సుమో | once again Tension in osmania university | Sakshi
Sakshi News home page

ఓయూలో గాల్లో లేచిన పోలీసుల సుమో

Published Wed, Mar 23 2016 4:38 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఓయూలో గాల్లో లేచిన పోలీసుల సుమో - Sakshi

ఓయూలో గాల్లో లేచిన పోలీసుల సుమో

హైదరాబాద్: చాలాకాలం తర్వాత ఓయూ భగ్గుమంది. ఈ సంఘటన చూసిన వారెవ్వరికైనా ఒకప్పటి తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలాంటి వాతావరణం టక్కున కళ్లముందుకు రావాల్సిందే. ప్రభుత్వ కొలువులకు ప్రకటనలు వెలువడటంతో పక్కవాడిని కూడా పలకరించే తీరికలేకుండా చదువుకుంటున్న విద్యార్థులు మరోసారి తమలో సామాజిక స్పృహ నివురుగప్పిన నిప్పులా అలాగే ఉందని నిరూపించారు. బుధవారం ఉదయం అంతా హోళీ వేడుకలకు సిద్ధమయ్యారు. కొంతమంది విద్యార్థులు మొదలుపెట్టారు కూడా.

ఇంతలోనే ఓ కబురు. లైబ్రరీ వెనుక ఎవరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని. మొన్న గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్య పెంచనందుకు, పరీక్షలను పోస్ట్ పోన్ చేయనందుకు అతడు ప్రాణాలుతీసుకున్నాడని వేగంగా వార్తలు పాకాయి. వెంటనే ఆ హాస్టల్ ఈ హాస్టల్ అని తేడా లేకుండా ఎన్సీసీ నుంచి తార్నాకా ఆర్టీసీ ఆస్పత్రి వరకు వున్న వసతి గృహాల్లో ఉన్నవిద్యార్థులందరికీ ఈ విషయం తెలిసింది. వెంటనే ఒక్కొక్కరుగా హోలీ వేడుకలు పక్కన పెట్టి కదిలారు. కాసేపట్లనో చీమలదండుగా మారారు. రోడ్డుమీదనుంచి లైబ్రరీ వైపు వెళ్లేందుకు కాలు కూడా ముందుకు కదపలేనంతగా విద్యార్థులు. అక్కడక్కడా నలుగురు, ఐదుగురుపోలీసులు వారిని చుట్టుముట్టి ప్రశ్నిస్తూ విద్యార్థులు కనిపిస్తున్నారు.

సరిగ్గా సరస్వతీ దేవాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని ఓ టార్పల్ కాగితంలో చుట్టి ఉంచారు. అంతకుముందే లైబ్రరీ వెనుక నీళ్ల ట్యాంకులోపలి నుంచి ఆ మృతదేహం బయటకు తీశారు. దీనిపై పోలీసులను వివరాలు కోరగా ఇప్పటి వరకు ఏమీ తెలియదని అన్నారు. రెండు రోజుల కింద చనిపోయి ఉండొచ్చని మాత్రం చెప్పారు. బాడీ డీ కంపోజ్ అయి దుర్వాసన వస్తుంది. అదేం పట్టించుకోకుండా విద్యార్థులు మృతదేహం ముందే కూర్చుని అతడు తమ యూనివర్సిటీ విద్యార్థేనని కావాలనే పోలీసులు వివరాలు మాయం చేశారని నినదిస్తున్నారు. ఇదే విషయంపై పోలీసులను ప్రశ్నించగా ఆధారాలు మాత్రం దొరకలేదని, ఒక మొబైల్ ఫోన్ మాత్రం లభ్యమైంది అని చెప్తుండగా పోలీసులు అబద్ధం చెప్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.

'అతడి వద్ద ఒక ఐడెంటీటి కార్డు కూడా ఉంది. కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి. అతడి దుస్తులు చూసి గుర్తుపడతామేమోనని వాటిని కూడా పోలీసులు తీసి దాచారు' అని విద్యార్థులు ఆరోపించారు. కానీ కొద్ది సేపట్లోనే అతడు విద్యార్థే కాదని, మాణికేశ్వర్ నగర్ లోని అడ్డా కూలీ అని, ప్రసాద్ అనే వ్యక్తి కుమారుడు బాబా అని పోలీసులు చెప్పారు. దీంతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడి వివరాలు తమకు పూర్ది స్థాయిలో చూపిస్తేనే మేం మృతదేహాన్ని అప్పగిస్తామని లేదంటే ఊరుకునేది లేదని, ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థి చనిపోతే అతడు కూలీగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

కాసేపు హైడ్రామా
ఇదిలాఉండగా, చనిపోయిన వ్యక్తి తమవాడే అని బస్తీ(మాణికేశ్వర్ నగర్) నుంచి కొందరు వచ్చారు. విద్యార్థులు వారిని దగ్గరకు రానివ్వకపోవడంతో కాసేపటికీ ఇంకొందరు అతడు తమ పిల్లాడే అని అంటూ దఫాల వారిగా భిన్నమైన వ్యక్తులు చనిపోయింది తమ వాడే అంటూ వచ్చారు. పైగా వారిలో ఆ తాలూకు బాధ ఏది కనిపించకపోవడం విద్యార్థులకు కోపాన్ని తెప్పించింది. బస్తీ వాసులతో పోలీసులు డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహం తీసుకుపోనివ్వకుండా అడ్డుపడ్డారు. ఈలోగా మాణికేశ్వర్ నగర్ కార్పోరేటర్ హరి వచ్చి అతడి ఆధ్వర్యంలో మృతదేహాన్ని తరలించారు.

కాసేపట్లోనే రణరంగంలా..
మాణికేశ్వర్ నగర్ కార్పొరేటర్ హరి ఎప్పుడైతే మృతదేహం తరలించేందుకు వచ్చారో అప్పుడే పెద్ద పోలీసు పటాలం దిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాలు ఏమి చెప్పకుండా పోలీసులు మృతదేహం తరలిస్తుండటంతో కోపానికి లోనైన విద్యార్థులు వారిపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య ఒక యుద్ధ వాతావరణం ఆవిష్కృతమైంది. ఓయూ పోలీస్ స్టేషన్ వరకు వేలమంది విద్యార్థులు పోలీసులను తరిమితరిమి కొట్టగా  తిరిగి రాళ్లతో విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు.

గాల్లో లేచిన పోలీసుల సుమో..
విద్యార్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతుండగా  పోలీసుల వాహనం టాటా సుమో ఆర్ట్స్ కాలేజీ వైపునుంచి వస్తుండగా ఒకేసారి విద్యార్థులు దానిపై రాళ్ల వర్షం కురిపించారు. సుమోను నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డు మీదనుంచి కారును పక్కకు తిప్పాడు. దీంతో ఆ సుమో ఏకంగా చుట్టూ పేర్చిన ఫెన్సింగ్ను ఢీకొట్టి గాల్లో లేస్తూ పార్క్లో నుంచి చిన్నచిన్న చెట్లు ఢీకొంటూ రెండో ఫెన్సింగ్ ను కూడా గుద్దేసి ఏకంగా వెళ్లి ఓయూ హాస్టల్స్ నిర్వహణా కార్యాలయానికి బలంగా ఢీకొట్టింది. అందులోని డ్రైవర్కు తీవ్రగాయాలయి వాహనమంతా రక్తసిక్తంగా మారింది. విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ వాహనాన్ని రిలీఫ్ వ్యాన్ సహాయంతో ఈడ్చుకెళ్లారు.

ఇంతకి చనిపోయింది విద్యార్థా? బస్తీ వాసా?
ఇంత జరిగినా అసలు చనిపోయింది విద్యార్థియేనా, లేక బస్తీకి చెందిన వ్యక్తా? అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా? అతడి పూర్తి వివరాలు ఏమిటీ అనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. మొత్తానికి హోలీ రోజు ఓయూ ఒకసారి మండుటెండల్లో మరింత హాట్ హాట్గా కనిపించింది.   

డీసీపీ ఏం చెప్పారంటే..
'మాణికేశ్వరీనగర్‌కు చెందిన ప్రసాద్‌ OU లైబ్రరీ వెనుక వైపు ఉన్న ట్యాంక్‌లోపడి చనిపోయాడు. నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరగడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉద్యోగాల సంఖ్య పెంచాలంటూ నినాదాలు చేస్తూ... కొందరు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో గాయాలైన పోలీసులకు 108 సిబ్బంది చికిత్స అందించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కేసులు నమోదు చేస్తాం' అని డీసీపీ రవీందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement