మరో వందేళ్లు గుర్తుంచుకోవాలి: కడియం
⇒ ‘ఉస్మానియా’ శతాబ్ది ఉత్సవాల పనులు వేగవంతం
⇒ ఉత్సవాలకు 200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
⇒ వీటి నిర్వహణపై ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం కడియం సమీక్షలు
⇒ పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశం
⇒ ఉత్సవ కమిటీలు తరచూ సమావేశమై సమీక్షలు జరుపుకోవాలి
⇒ ఈ ఉత్సవాలకు వచ్చే అతిథుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు మరో శతాబ‍్ద కాలం గుర్తుండే విధంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఈ ఉత్సవాలలో ఎక్కడా, ఎలాంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలపై కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. శతాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ఇవ్వడంపై వర్సిటీ వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డిలు మంత్రి కడియం శ్రీహరికి అభినందనలు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఎక్కువ సమయం లేనందున పనులు వేగవంతం చేయాలని, ఎక్కడా నాణ్యత లోపించకూడదని అధికారులను ఆదేశించారు.
ఈ ఉత్సవాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు చాటిచెప్పే విధంగా కళా రూపాల ప్రదర్శన ఉండాలన్నారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. యూనివర్శిటీ విద్యార్థులు, సిబ్భంది, అతిథులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఉత్సవాలకు సంబంధించి కల్చరల్ కమిటీ, ఆహ్వాన కమిటీ, నిర్వహణ కమిటీ, ఆతిథ్య కమిటీలు సమావేశమై కార్యచరణను రూపొందించుకున్నాయని వీసి రామచంద్రం తెలిపారు.
శతాబ్ది ఉత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా సెంటినరీ రన్ కూడా నిర్వహించామన్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఉస్మానియాలో శతాబ్ది సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శతాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్న అతిథులందిరికీ ఆహ్వానాలు పంపుతున్నామని కడియం శ్రీహరికి తెలిపారు. సమీక్షా సమావేశానికి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, పాఠశాల విద్య సంచాలకులు కిషన్ హాజరయ్యారు.