కాంగ్రెస్‌కు ఆ నైతిక హక్కు లేదు
ఓయూలో నిరుద్యోగ గర్జనపై కడియం మండిపాటు
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల తరబడి యూనివర్సిటీలు సమ స్యల వలయంలో కొట్టుమిట్టాడేటట్టు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓయూలో నిరుద్యోగ గర్జన ఏర్పాటు చేసుకునే నైతిక హక్కు లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు చేపట్టలేని వారు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను విడుదల చేయలేని వారు ఇవాళ ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలో గర్జనను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 8 యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 420 కోట్లు కేటాయించిందన్నారు. 1,061 అధ్యాపక పోస్టులను భర్తీ చేసే అవకాశం ఇచ్చిందన్నారు.
వచ్చే ఏడాది దాదాపు 500 పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. మొత్తంగా మొదటి, రెండో దశల్లో 1,559 పోస్టులను భర్తీ చేసుకునే అవకాశాన్ని వర్సిటీలకు ఇచ్చిందన్నారు. ఉస్మానియాకు ఏనాడూ ఒక్క రూపాయి ఇవ్వని వారు, ఉస్మానియాలో నియామకాలు చేపట్టని వారు, విశ్వ విద్యాలయాల విద్యను భ్రష్టు పట్టించిన వారు అక్కడ నిరుద్యోగ గర్జన.. కాంగ్రెస్ గర్జన చేయడం సరికాదన్నారు. అనవసర రాజకీయం అంతా యూనివర్సిటీలపై రుద్దవద్దని, సభలు బయట పెట్టుకోవాలని కడియం కాంగ్రెస్ పార్టీకి సూచించారు.