మన పోలీస్.. నంబర్ 1
∙ మెరుగైన సేవలందిస్తున్నారు
∙ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు
∙ ఫ్ల్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం
∙ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఎంతో మార్పు కనిపిస్తోంది
∙ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
ఇబ్రహీంపట్నంరూరల్: మన రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచారని.. ఆ పేరును అలాగే నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయిని మాట్లాడారు. భారతదేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖ ఆదర్శంగా నిలిచిందన్నారు. పోలీస్ శాఖ గతంలోకంటే మెరుగ్గా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. చెర్వులను దత్తత తీసుకోవడం, హరితహారం కార్యక్రమంలో పాలుపంచుకోవడం లాంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని నాయిని చెప్పారు.
పోలీసులంతా మన బంధువులని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శాఖలో మార్పు వచ్చిందన్నారు. పోలీసులు గర్వపడకుండా ప్రజలు వచ్చినప్పుడు మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఇతరుల వద్ద చేయి చాచకుండా ప్రతి నగర పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ.75వేలు, జిల్లా పోలీస్ స్టేషనుకు రూ.50వేలు, గ్రామీణ పోలీస్ స్టేషన్లకు రూ.25వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. పోలీసులు నిరాశ చెందకుండా విధులు నిర్వర్తించాలని.. ప్రభుత్వం తమకు అండగాఉంటుందన్నారు.
పోలీస్ శాఖ బలోపేతం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి మహేందర్‌రెడ్డి
పోలీస్ డిపార్టుమెంట్ గతంకంటే ఇప్పుడు బాగా పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అందుబాటులో ఉంటుందన్నారు. పోలీసుశాఖ బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పోలీసులు సహకరిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధునాతన పోలీస్ స్టేషన్లు నిర్మించడానికి సహకరిస్తామన్నారు. బషీరాబాద్ మండలంలో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను ఈ నెల14న ప్రారంభిస్తామని మహేందర్‌రెడ్డి చెప్పారు. అనంతరంప్రతి ఒక్కరు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడాలని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ రూపొందించిన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పోస్టర్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి,డీజీపీ అనురాగ్‌శర్మ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు అవిష్కరించారు.
పోలీస్‌స్టేషన్ గదులు, ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన
ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన షీ టీం, ట్రైనింగ్‌గది, కౌన్సెలింగ్ గదులు, రిసెప్షన్, సీఐ గదులను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి , డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, కృష్ణారెడ్డి పరిశీలించారు. జనరల్ డైరీలో హోంమంత్రి చేతితో రాసి ప్రారంభించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఢఈ సందర్భంగా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌కు గురునానక్ విద్యా సంస్థలు, భారత్ విద్యా సంస్థల అధినేతలు కంప్యూటర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, పోలీస్ హౌజింగ్ బోర్డు ఎండీ మల్లారెడ్డి, చైర్మన్ దామోదర్, రాచకొండ జాయింట్ సీపీ తరుణ్‌జోషీ, ఏసీపీ మల్లారెడ్డి. ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి, హరిత, జెడ్‌పీటీసీ సభ్యుడు అయిలయ్య, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.