శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ఈ దారుణం గురించి రెండు రోజుల ముందే హెచ్చరించిందా అంటే.. అవుననే అంటున్నారు అధికారులు. రెండు రోజుల క్రితం జైషే మహ్మద్ వర్గాలు అఫ్గానిస్తాన్‌లో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాయి. అఫ్గానిస్తాన్‌లో దాడి జరిగిన తీరు.. గురువారం పుల్వామాలో జరిగిన దాడి రెండు ఒకేలా ఉన్నట్లు సమాచారం.
అఫ్గానిస్తాన్‌లో కూడా పేలుడు పదార్థంతో ఉన్న వాహనాన్ని ఉపయోగించి ముష్కరులు దారుణానికి తెగబడ్డారు. గురువారం పుల్వామాలో కూడా ఇదే తరహా దాడే జరిగింది. అయితే ఈ వీడియోను రెండు రోజుల క్రితమే గమనించిన జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. వీడియోతో పాటు అవసరమైన ఇన్‌పుట్స్‌ను కూడా ఇంటిలిజెన్స్ వర్గాలకు షేర్ చేసినట్లు సమాచారం. అయితే ఇంటిలిజెన్స్ అధికారులు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని... ఫలితంగా 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని అంటున్నారు విశ్లేషకులు.
దాడి పట్ల ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లే సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండవచ్చని భావిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిసింది.(ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!)
Comments
Please login to add a commentAdd a comment