కశ్మీర్‌లో ముష్కరుల మారణకాండ
- పుల్వామా పోలీసు కాంప్లెక్స్‌పై దాడి.. 8 మంది భద్రతా సిబ్బంది మృతి
- ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లా పోలీసు కాంప్లెక్స్‌పై దాడికి పాల్పడడంతో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సహా 8 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌కు 25 కి.మీ. దూరంలోని పుల్వామా జిల్లాలోని పోలీసు కాంప్లెక్స్‌లోకి విదేశీయులుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు చొరబడ్డారు. వెంటనే పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ సిబ్బంది అప్రమత్తమై ఉగ్రవాదుల్ని చుట్టుముట్టారు. అదే సమయంలో ఆ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న పోలీసు సిబ్బంది కుటుంబసభ్యుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మధ్యాహ్నానికి భద్రతా సిబ్బంది ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. సాయంత్రం 5 గంటల సమయంలో మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమైందని అధికారులు తెలిపారు. ఎదురు కాల్పులు ముగిశాయని, మూడో మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని వారు వెల్లడించారు.
మృతుల్లో నలుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది
ముగ్గురు ఉగ్రవాదులు.. పోలీసు కాంప్లెక్స్‌లోని మూడు బ్లాకుల్లోకి ప్రవేశించి భద్రతా బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. ఎన్‌కౌంటర్ సమయంలో ఉగ్రవాదుల్లో ఒకరు భవనం నుంచి బయటకు వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని, అతన్ని అక్కడే మట్టుబెట్టామని పోలీసు అధికారులు చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినవారిలో నలుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్, ముగ్గురు ప్రత్యేక పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఇది ఆత్మాహుతి దాడేనని శ్రీనగర్ 15వ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సంధు చెప్పారు. భారీ ప్రాణనష్టం చోటుచేసుకుందని, భద్రతా బలగాలకు ఇది దుర్దినమని డీజీపీ ఎస్పీ వైద్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే మన భద్రతా బలగాలు ఎంతో ధైర్యంగా పోరాడాయని, రాష్ట్రం నుంచి ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు మరింత దృఢనిశ్చయంతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ముగ్గురు పాక్ రేంజర్లు మృతి
జమ్మూలోని భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని దీటుగా తిప్పికొట్టామని, భారత బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు పాక్ రేంజర్లు మరణించారని బీఎస్‌ఎఫ్ తెలిపింది. జమ్మూలోని పర్గ్వాల్ ప్రాంతంలో శనివారం మధ్యా హ్నం నుంచి పాక్ కాల్పుల్ని కొనసాగించిందని, అదే స్థాయిలో గట్టిగా బదులిచ్చామని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. కాగా శనివారం పాక్ బలగాలు ఆర్‌ఎస్ పురా సెక్టార్ సరిహద్దు వెంట కాల్పులకు పాల్పడడంతో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కె.కె.అప్పారావు గాయపడ్డారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి వెల్లడించారు.