శ్రీనగర్ : కల్లోల కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై మెరుపుదాడికి తెగబడ్డారు. క్షణాల్లో తేరుకున్న భద్రతా సిబ్బంది ఉగ్రమూకలకు ధీటుగా జవాబిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల నుంచి ఎడతెగని కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం కాల్పుల్లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
గ్రెనేడ్లు విసిరి బీభత్సం.. : తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పుల్వామా జిల్లా కేంద్రంలోని 185వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు.. తొలుత గ్రెనేడ్లు విసిరి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. క్యాంప్‌లోని ఓ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులు ఉండి ఉండొచ్చని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు.
టార్గెట్ పుల్వామా : సరిహద్దుకు సమీపంలోని పుల్వామా జిల్లాపై తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత ఆగస్టులో పుల్వామా పోలీస్ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది సిబ్బంది చనిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 12 గంటల ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ తర్వాత రెండు నెలలకే శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని బీఎస్‌ఎఫ్ క్యాంపు సమీపంలో పేలుడు, కాల్పులు చోటుచేసుకున్నాయి. తాజా దాడికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment