ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించిన పోలీసులు
ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణకు పతకాల పంట
సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో సత్తా చాటిన రాష్ట్ర పోలీసులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. కొత్త రాష్ట్రం ఈ ఘనత సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మైసూరులో జరిగిన ఈ పోటీల్లో దేశంలో ఉత్తమ రాష్ట్రానికి అందించే ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ తోపాటు పలు పతకాలను రాష్ట్ర పోలీసులు గెలుపొందారు. ఈ మేరకు ట్రోఫీలు, పతకాల వివరాలు వెల్లడిస్తూ సీఎం కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సైంటిఫిక్ ఎయిడ్ టూ ఇన్వెస్టిగేషన్ బృందం రెండు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలుపొందింది.
ఫోరెన్సిక్ సైన్స్ రాత పరీక్షలో సీఐడీ ఎస్‌ఐ డి.విశ్వేశ్వర్ బంగారు, సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ కేవీఎం ప్రసాద్ వెండి, నల్లగొండ జిల్లా చందంపేట ఎస్‌ఐ ఆర్.సతీశ్ కాంస్య పతకాలు గెలు పొందారు. లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పోటీ విభాగంలో సీఐడీ ఇన్స్‌పెక్టర్ టి.అమృత్ రెడ్డి బంగారు పతకం.. పోర్‌ట్రెయిట్ పార్ల్ విభాగంలో సీఐడీ ఏఎస్‌ఐ ఎం.రామకృష్ణ వెండి పతకాన్ని గెలుపొందారు. తెలంగాణ పోలీసుల జాగిలం రీటా బంగారు పతకాన్ని గెలుపొందింది. సైంటిఫిక్ ఎయిడ్ టూ ఇన్వెస్టిగేషన్ విభాగంలో తెలంగాణ పోలీసులు విన్నర్స్ ట్రోఫీ, హార్డ్ లైనర్స్ ట్రోఫీలను, కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగంలో రన్నర్స్ ట్రోఫీలను గెలుపొందారు.