‘ఔటర్’పై వేగానికి కళ్లెం
- ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసుల ప్రతిపాదనలు
- నాలుగు లేన్లకు నిర్ణీత వేగం
- ఆమోదిస్తే అమలు చేయడమే తరువాయి
- స్పీడ్ పెరిగినా.. తగ్గినా ఫైన్ కట్టాల్సిందే
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై ప్రమాదాలను నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు ‘స్పీడ్ లిమిట్’ అనే కొత్త విధానానికి తెర తీశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. హెచ్‌ఎండీఏ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. నాలుగు లైన్ల ఔటర్‌పై ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 నుంచి 120 కి.మీ. వేగంతో పోవచ్చు. అయితే ఒక్కోలైన్‌కు ఒక్కో స్పీడ్ నియంత్రణ పెడితే ప్రమాదాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదన ప్రకారం ఎంత వేగంతో వెళ్లాలో నిర్ధారించుకున్న వాహనం ఏ దారిలో వెళ్లాలో అదే దారిలో వెళ్లాలి. వేగం తగ్గినా పెరిగినా స్పీడ్ గన్ పరిగెడుతుంది. తద్వారా చలానా రాస్తారు. ఇలా చేయడం వల్ల ఒకరి దారికి ఒకరు అడ్డురాకండా మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌పై నాలుగు లైన్లలోను 120 కి.మీ. స్పీడ్‌తో వెళ్లవచ్చనే నిబంధన వల్ల 120 కి.మీ. స్పీడ్‌తో వచ్చే వాహనానికి ముందు 50 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్న వాహనం అడ్డు వస్తోంది. దీంతో 120 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్న వాహ నం ఓవర్‌టేక్ చేసి మరో లైన్‌ద్వారా ముందుకు వెళ్లాల్సి వచ్చేది. ఇలా పలుసార్లు ఓవర్‌టేక్‌లు చేస్తూ లైన్‌లు మార్చుతున్న క్రమంలోనే వాహనం అదుపు తప్పడం గాని, మరో వాహనాన్ని ఢీ కొట్టడం గాని జరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాలపై పోస్టుమార్టం
రోడ్డు ప్రమాదాలు జరగడం ఆ తరువాత అందరు మరచిపోవడం ఇది నిన్నటి మాట. సైబరాబాద్‌లో ఇక నుంచి ప్రతి రోడ్డు ప్రమాదాలపై ఘటన జరిగిన వెంటనే పోస్టుమార్టం నిర్వహిస్తారు. ప్రమాదం ఎలా జరిగింది..? అందుకు కారణాలు ఏమిటి..? ఎవరిది తప్పు..? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? తదితర అంశాలకు జవాబులు వెంటనే పోలీసు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. ఈ వివరాలను పోలీసు బాస్‌లు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇక నుంచి ప్రమాదాలు నివారించవచ్చంటున్నారు అధికారులు. అయితే ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను త్వరలో రూపొందించి అమలుల్లోకి తెస్తామని ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. సైబరాబాద్‌లో ఏఏ ప్రాంతాల్లో వాహనాలు ప్రమాదాలకు గురికాకండా ఎలా వెళ్లాలనే అంశాలను కూడా పోలీసు వెబ్‌సైట్‌లో చేరుస్తామన్నారు.
ట్రాఫిక్‌కు 22 మంది ఎస్‌ఐలు
ట్రాఫిక్ విభాగానికి కొత్తగా 22 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలు వచ్చారని ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. వీరిలో ఐదుగురు ఎస్‌ఐలను త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రారంభించే పెట్రోలింగ్‌కు ఉపయోగిస్తామన్నారు. ఒక్కో వాహనంలో ఒక ఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. ప్రత్యేకంగా 16 మంది కానిస్టేబుళ్లకు కూడా ఇందుకోసం శిక్షణ ఇచ్చామన్నారు. సీట్‌బెల్డ్, పార్కింగ్, రాంగ్‌రూట్, ఓవర్ స్పీడ్‌లపై వీరు దృష్టి పెడతారు. త్వరలో రెండు స్పీడ్ గన్స్, రెండు క్రేన్‌లు కూడా వస్తున్నాయన్నారు.
- అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ