
వెంటి‘లేట్’ర్
బోధనాసుపత్రుల్లో అందని ప్రాణ వాయువు
ఒకరికి కావాలంటే.. మరొకరిది తీయాల్సిందే!
వెంటిలేటర్లు లేక రోగులు మృత్యువాత
వేధిస్తోన్న బయో మెడికల్ ఇంజినీర్ల కొరత
సిటీబ్యూరో: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సకాలంలో ప్రాణ వాయువు అందక రోగులు విలవిల్లాడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ ఏర్పాటు చేయాలంటే... అప్పటికే వేరొకరికి అమర్చినది తొలగించక తప్పని పరిస్థితి. నగరంలోని పేరెన్నికగన్న ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రులన్నింటిలోనూ ఇదే దుస్థితి. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులకు వెంటిలేటర్ల కొరత కారణంగా ఎండోట్రెకియల్ ఇంటుబేషన్ పద్ధతిలో అంబూ బ్యాగు ద్వారా ప్రాణ వాయువు అందించాల్సి వస్తోంది. ఈ విధానంలో బెలూన్‌ను చేతితో ఒత్తడం వల్ల కృత్రిమంగా గాలిని అందిస్తారు. సరఫరా హెచ్చుతగ్గులతో ఒక్కోసారి రోగులు మృత్యువాత పడే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
నిధులున్నా... తప్పని నిరీక్షణ
నగరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.520 కోట్లు కేటాయించింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరికరాల కొనుగోలుకు వెచ్చించనున్నట్లు ప్రకటిస్తూ... ఆ మేరకు ఇటీవల ఆస్పత్రుల నుంచి ఇండెంట్ తెప్పించింది. వీటి కొనుగోలు బాధ్యతను తెలంగాణ వైద్య, మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించింది. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన టీఎస్‌ఎంఐడీసీ సాంకేతిక అంశాలను కారణంగా చూపుతూ తరచూ కొనుగోళ్లను వాయిదా వేస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంస్థల నుంచి ఆశించిన ంత కమిషన్ రానందునే కొర్రీలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
నిమ్స్‌లో సీజ్ చేసిన ఏసీబీ
ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో రోగుల అవసరాలు తీర్చేందుకు అప్పటి డెరైక్టర్ ధర్మరక్షక్ హ యాంలో వెంటిలేటర్లను కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో కేసు నమోదు చేసిన ఏసీబీ వాటిని తాత్కాలికంగా సీజ్ చేసింది. కొనుగోలు చేసి రెండేళ్లు దాటినా వెంటిలేటర్లు స్టోర్ రూంలోనే మగ్గుతున్నాయి. సత్వరమే వీటిని వినియోగంలోకి తీసుకురావాలని వైద్యులు కోరుతున్నారు.
బయో మెడికల్ ఇంజనీర్ల కొరత
ఉస్మానియా, గాంధీ సహా నగరంలోని ఒక్క ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా బయోమెడికల్ ఇంజినీర్లు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కొనుగోలు చేసిన వైద్య పరికరాలకు కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం నిర్ణీత గడువులో సాంకేతిక లోపాలు తలెత్తితే కంపెనీ టెక్నీషియన్స్ మరమ్మతు చేస్తారు. వారంటీ ముగిసిన తరువాత వైద్య పరికరాలకు సుస్తీ చేస్తే వాటిని మరమ్మతు చేసేవారు లేరు. దీంతో మరమ్మతుల సాకుతో విలువైన యంత్రాలను మూలన పడేయాల్సి వస్తోంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ చెల్లించే అవకాశం ఉన్నా.. అధికారులు అందుకు చర్యలు తీసుకోకపోవడంతో టెక్నీషియన్లు రిపేరు చేసేందుకు రావడం లేదు.
ఖాళీ లేదంటే..
మా అబ్బాయి రమేష్ కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ఉస్మానియాకు తీసుకొచ్చాను. వెంటిలేటర్లు ఖాళీ లేనందున గాంధీ లేదా నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం.
- నారయ్య, మహబూబ్‌నగర్‌జిల్లా
కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం..
రెండు రోజుల క్రితం మా స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయమవడంతో చికిత్స కో సం నిమ్స్ అత్యవసర విభాగానికి తీసుకెళ్లాం. పరీక్షించిన వైద్యులు బాధితుని పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస సరిగా తీసుకోలేక పోతున్నాడని, ఆయనకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించాలని చెప్పారు. ఆస్పత్రిలో వెంటిలేటర్లు ఖాళీ లేవని చెప్పడంతో భారమైనా తప్పని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. - శ్రీనివాసరెడ్డి, దేవరకొండ