హైదరాబాద్: నేరం చేసి అరెస్టు కావడం...బెయిల్ పొంది బయటకు రావడం...మళ్లీ అదే పంథా కొనసాగిస్తూ ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్న ముగ్గురు కరుడుగట్టిన చైన్‌స్నాచర్లపై సైబరాబాద్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేసి నిర్భంధంలోకి తీసుకున్నారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు చేస్తున్న బీదర్‌కు చెందిన టకీ ఆలీ, సల్మాన్ ఆలీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోవింద్‌లపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి 66 కేసుల్లో ప్రమేయమున్న టకీఆలీ, 113 కేసుల్లో ప్రమేయమున్న సల్మాన్ అలీ కొంతమంది చైన్‌స్నాచర్లకు సారథ్యం వహిస్తున్నారు. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో నివాసముంటున్న గోవింద్ జంట పోలీసు కమిషనరేట్లలో 27 చైన్ స్నాచింగ్‌లు చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాడని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్‌డీ నవీన్ కుమార్ తెలిపారు.