ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
- ఇఫ్తార్ విందులో గవర్నర్ నరసింహన్
- హాజరైన సీఎం కేసీఆర్, ఇరు రాష్ట్రాల స్పీకర్లు, మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షిం చారు. రంజాన్ మాసం నేపథ్యంలో శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ, ఏపీ మం డలి చైర్మన్లు స్వామిగౌడ్, ఎ.చక్రపాణితో పాటు ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం కొనసాగేందుకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో మగ్రీబ్ నమాజ్‌కు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్‌లో శాకాహార హలీం, బిర్యానీ, షీర్‌ఖుర్మా, కద్దుకి ఖీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, బీజేపీఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
ప్రొటోకాల్ ఎప్పుడూ తప్పలేదు...
ఇఫ్తార్ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాలేదు. చంద్రబాబును ఆహ్వానించారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా గవర్నర్ తనదైన శైలిలో చమత్కరించారు. చంద్రబాబుతో సహా ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన వారందరినీ ఆహ్వానించానని, ప్రొటోకాల్ విషయంలో తానెప్పుడూ విఫలం కాలేదని బదులిచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంలో జోక్యం చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. మీరెలా చెబితే అలా చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.