పెట్రోల్, మద్యంతోనే ఖజానాకు కిక్కు
Published Thu, Apr 14 2016 3:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వృద్ధి రేటు ప్రధానంగా రెండు అంశాలపైనే ఆధారపడి ఉందని మరోసారి రుజువైంది. ఒకటి మద్యం, రెండోది పెట్రోల్ ఉత్పత్తులు. ఈ రెండింటి కారణంగానే 2015-16 బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా 95.4 శాతం పన్ను వసూళ్లు సాధ్యమైంది. రాష్ట్రంలోని 12 డివిజన్‌లతో పాటు పెట్రో ఉత్పత్తులు, మద్యం, ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూస్) నుంచి ఏడాదిలో రూ.31,117. 94 కోట్ల పన్నులను వసూలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అధికారులతో పని లేకుండానే..
వాణిజ్యపన్నుల శాఖకు మద్యం, పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నుల ద్వారానే సగం రెవెన్యూ సమకూరుతుండడం గమనార్హం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మద్యం నుంచి 'ఎక్సైజ్ బై వ్యాట్' ద్వారా రూ.8168.99 కోట్లు, పెట్రోల్, డీజిల్‌పై విధించే పన్నుల ద్వారా రూ.6485.48 కోట్లు వసూలైంది. సింగరేణి, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.1457.06 కోట్లు పన్నుల రూపంలో వసూలైంది. అంటే ఈ మూడు ప్రధాన పద్దుల ద్వారా వచ్చిన మొత్తం ఏకంగా రూ.16,111.53 కోట్లు కావడం గమనార్హం.
ఈ మొత్తం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సంబంధం లేకుండా సర్కారు ఖజానాకు అందుతుండటం మరో విశేషం. రాష్ట్రంలోని 12 డివిజన్‌ల నుంచి అధికారులు, సిబ్బంది వసూలు చేసే పన్నులు రెవెన్యూ రూపంలో సమకూరుతున్నాయి. 12 డివిజన్‌ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,006.40 కోట్లు వసూలైంది. 12 డివిజన్‌లలో కూడా పంజాగుట్టలో రూ. 2422.30 కోట్లు వసూలు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ డివిజన్‌లోరూ. 314.32 కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది.
Advertisement
Advertisement