దొంగతనం ‘చూసి’ నేర్చుకుంది!
దొంగతనం ‘చూసి’ నేర్చుకుంది!
Published Wed, Jul 19 2017 12:56 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
‘బ్యాగ్ దొంగ’గా మారిన పీజీ విద్యార్థిని
- ఓ చోరీ చూసి దొంగతనాలు నేర్చుకున్న యువతి
- రద్దీ బస్సుల్లో ప్రయాణికులే టార్గెట్
- గత ఆరు నెలల్లో 3 దొంగతనాలు
- అరెస్టు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు
హైదరాబాద్: ఆమె పేరు అర్చన.. దూర విద్యా విధానంలో సైకాలజీలో పీజీ చేస్తోంది.. తరచూ సిటీకి వచ్చి వెళ్లే ఈమె ఓ చోరీని చూసి తానూ దొంగగా మారింది.. రద్దీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల్ని టార్గెట్ చేసుకుంది.. వారి బ్యాగుల్లోని విలువైన వస్తువులు, బంగారం తస్కరించేది.. గత ఆరు నెలల్లో మూడు దొంగతనాలు చేసింది.. చివరకు మంగళవారం ఎస్సార్‌నగర్ క్రైమ్ పోలీసులకు చిక్కిందని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు విలేకరులకు వెల్లడించారు.
చోరీ చూసి అదే పని..
మెదక్‌కు చెందిన పి.అర్చన(27) ఉస్మానియా నుంచి దూరవిద్యలో సైకాలజీలో పీజీ చేస్తోంది. కూకట్‌పల్లి వివేకానంద కాలనీలో నివసించిన ఆమె ఓ ఫిజియోథెరపిస్ట్ వద్ద సహాయకురాలిగా పనిచేసింది. గత కొన్నాళ్లుగా స్వస్థలమైన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కుటుంబం తో కలసి ఉంటోంది. ఈమె తండ్రి ప్ర భుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా రు. సిటీకి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న అర్చనను ఓ ‘సీన్’ఆకర్షించింది. ఓ మహిళా దొంగ రద్దీ బస్సులో చోరీ చేయడం చూసి తానూ అదే పని చేయాలని నిర్ణయించుకుంది.
తల్లి మందుల కోసం వచ్చి వెళ్తూ..
అర్చన తల్లికి కొన్నాళ్ల క్రితం గుండె జబ్బుకు సంబంధించిన చికిత్స జరిగింది. తల్లికి అవసరమైన మందుల కోసం అర్చన తరచుగా హైదరాబాద్‌కు వచ్చి వెళుతోం ది. ఇలా వచ్చినప్పుడు అదును చిక్కితే ఓ చోరీ చేస్తోం ది. రద్దీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వెనుక నిల్చునే అర్చన అదును చూసుకుని వారి హ్యాండ్ బ్యాగ్ జిప్ తెరుస్తుంది. అందులోని విలువైన వస్తువులు, పర్సులు, బంగారం తీసుకుని వెంటనే బస్సు దిగిపోతోంది. కూకట్‌పల్లి–ఈఎస్‌ఐ, ఈఎస్‌ఐ–మైత్రీవనం, మైత్రీవనం–పంజగుట్ట మధ్య గత ఆరు నెలల్లో 3 చోరీలు చేసిన అర్చన 51.6 గ్రాముల బంగారం తస్కరించింది.
బాధితురాలు ఇచ్చిన సమాచారంతో..
ఏటీఎం కార్డు పోగొట్టుకున్న బాధితురాలికి.. సీసీ టీవీ దృశ్యాలను చూపించి బస్సులో ఎప్పుడైనా అనుమానితురాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. మంగళవారం అర్చనను బస్సులో చూసిన బాధితురాలు నిలదీసింది. ఓ ఆంటీ కోరడంతో ఏటీఎం కార్డు నుంచి డబ్బు డ్రా చేసి ఇచ్చానని, తనకు సంబంధం లేదని తప్పించుకోవాలని ప్రయత్నించింది. బాధితురాలు ఎస్సార్‌నగర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి అర్చనను అదుపులోకి తీసుకున్నారు. తాను పీజీ విద్యార్థినని, తమది సంప్రదాయ కుటుంబమని, తనపై అనవసరంగా నేరం మోపుతున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి న అర్చన.. వారితో వాగ్వాదానికి దిగింది. పోలీసులు ఆధారాలు చూపడంతో చివరికి నేరం అంగీకరించింది. అర్చనను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె నుంచి 8.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లో కొంత.. స్నేహితునికి కొంత
అర్చనకు ఎలాంటి అలవాట్లు లేవని, జల్సాలు సైతం చేయదని పోలీసులు చెప్తున్నారు. తస్కరించిన సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత ఇంట్లోనే ఇస్తూ.. తాను ఫిజియోథెరపీకి సంబంధించి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నానంటూ తల్లిదండ్రులను నమ్మించింది. మిగిలిన మొత్తాన్ని ఫిజియోథెరపీ చేస్తున్న సమయంలో పరిచయమైన ఓ స్నేహితునికి ఇస్తున్నట్లు వెల్ల డైంది. అర్చన చేసిన నేరాలకు సంబంధించి ఎస్సార్‌నగర్ ఠాణాలో రెండు, పంజగుట్ట ఠాణాలో ఒక కేసు నమోదయ్యాయి. ఎస్సార్‌నగర్‌లో ఓ మహిళ బ్యాగ్ నుంచి అర్చన తస్కరించిన వాటిలో ఏటీఎం కార్డు సైతం ఉంది. కార్డుతో పాటే పిన్ నంబర్ ఉండటంతో.. మూసాపేటలోని ఓ ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేసింది. ఏటీఎంలోని సీసీ కెమెరా ఫీడ్ ఆధారంగా అనుమానితురాలిని గుర్తించారు.
Advertisement