ఎక్కడివక్కడే
- నేడు సార్వత్రిక సమ్మె
- స్తంభించనున్న రవాణా
- ఐటీ కారిడార్‌లలో వాహనాలకు మినహాయింపు
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. నగరంలో మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ ప్రభావం కొంతమేరకు కనిపించింది. బుధవారం ఉదయం నుంచే సిటీబస్సులు, ఆటోల రాకపోకలు స్తంభించనున్నాయి. ట్యాక్సీలు, క్యాబ్‌లు సమ్మెకు మద్దతిస్తున్నాయని... ఐటీ కారిడార్‌లలో వీటికి మినహాయింపునిచ్చినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.
నగరంలోని ఇతర మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంతోష్‌రెడ్డి తెలిపారు. నగరంలోని 28 డిపోలకు చెందిన సుమారు 3,800 బస్సులు, లక్షా 25 వేల ఆటోరిక్షాలు నిలిచిపోనున్నాయి. స్కూల్ ఆటోలూ తిరిగే అవకాశం కనిపించడం లేదు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్ల నుంచి తెలంగాణ, ఏపీలలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో 3,500 బస్సులకు సైతం బ్రేకులు పడబోతున్నాయి. తెలంగాణ లారీ యజమానుల సంఘం సమ్మెకు మద్దతు ప్రకటించింది. లారీలు నడపడం, నడపకపోవడం వాహన యజమానుల వ్యక్తిగతఅంశమని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఆటోలు, బస్సులు నిలిచిపోవడం వల్ల 40 లక్షల మందిపైగా ప్రయాణికులు అవస్థలకు గురయ్యే పరిస్థితి ఉంది.
ఎంఎంటీఎస్ సర్వీసుల పెంపు...
సార్వత్రిక సమ్మెను దృష్టిలో ఉంచుకొని రైళ్ల రాకపోలపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. నగరంలోని వివిధ మార్గాల్లో ప్రస్తుతం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయని... రద్దీకి అనుగుణంగా వీటి సంఖ్యను పెంచనున్నట్టు తెలిపారు.
బిల్లు వెనక్కి తీసుకోవాలి...
కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక రోడ్డు రవాణా, భద్రతా బిల్లు-2015 ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాల జేఏసీ, ఆటో సంఘాల జేఏసీ వేరు వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. ప్రజా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఈ బిల్లును తెస్తోందని టీఆర్‌ఎస్ అనుబంధ ఆటో కార్మిక సంఘ అధ్యక్షులు వేముల మారయ్య, ఏఐటీయూసీ నేత బి.వెంకటేశం, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి ఆర్లే సత్తిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.