
అలా చేస్తే పోలవరం పడుకుంటుంది!
- కేంద్రానికి అప్పగిస్తే పోలవరం ప్రాజెక్టు పడకేసినట్లేనన్న చంద్రబాబు
- 2018 కల్లా పూర్తిచేస్తామంటే ఈ క్షణమే అప్పగిస్తానని వ్యాఖ్య
- ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కుదరదని తేల్చిచెప్పిన సీఎం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పడుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం చెబితే దీన్ని ఈ క్షణమే అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఆవేశంగా ప్రకటించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరు తూ బుధవారం అసెంబ్లీలో ప్రతిపాదించిన తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ సీఎం ఈ మాటలు చెప్పారు. ‘పోలవరం జాతీయ ప్రాజె క్టని కేంద్రానికిచ్చి ఇంట్లో పడుకుంటే ప్రాజెక్టు కూడా అలాగే పడుకుంటుంది. 2018కల్లా ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలి. ఇందుకు మేం డబ్బు ఖర్చుపెడతాం. కేంద్రానికి చెప్పే పనులు చేస్తున్నాం. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించి, ముందుకెళ్లి పూర్తి చేసి కరువు ప్రాంతాలకు నీరివ్వాలన్నదే లక్ష్యం’ అని చంద్రబాబు అన్నారు.
సీఎం వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న అధికార వర్గాలు
ఇదిలా ఉండగా పోలవరంపై సీఎం వ్యాఖ్యల్ని రాజకీయ నేతలే కాకుండా అధికారవర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ‘‘2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పగలిగితే కేంద్రానికి ప్రాజెక్టు పనులను అప్పగించేందుకు సిద్ధమని సీఎం అనరాదు. అసలు ఈయనే తనవారికి పనులు అప్పగించి కమీషన్లు తీసుకునేందుకు లాబీయింగ్ చేసి మేమే పోలవరం పనులు చేసి బిల్లులు సమర్పిస్తాం. మీరు రీయింబర్స్ చేయండి అని కోరారు. ఇప్పుడు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు’’ అంటూ అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కుదరదు: చంద్రబాబు
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు కుదరదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు శాసనసభలో చట్టం చేయలేమని స్పష్టం చేశారు. సీపీఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నేత జల్లి విల్సన్, బీసీ ఉద్యమ నేత కె.రామాంజనేయులు నాయకత్వంలో పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులు బుధవారమిక్కడ సీఎం చంద్రబాబును కలసి చేసిన డిమాండ్ కు ఆయన ఈవిధంగా స్పందించారు.
బీసీ, మైనారిటీ సంక్షేమం, అభివృద్ధికి సబ్ ప్లాన్ చట్టం చేయాలని వారు కోరగా సాధ్యం కాదని సీఎం బదులిచ్చారు. అయితే ఇందుకు కారణాలను వెల్లడించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు నిరుపయోగంగా మారుతున్నాయని, ప్రభుత్వ రంగం 15 శాతానికి తగ్గి ప్రైవేటు రంగం 85 శాతానికి చేరిన నేపథ్యంలో రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.