
ఏటీఎం ద్వారా ‘పోస్ట్’ చేద్దాం
సాక్షి, హైదరాబాద్: సహజంగా ఎవరికైనా ఉత్తరం పంపాలంటే మీరు ఎక్కడికెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తాం పోస్టాఫీసుకే కదా అని ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఇకపై పోస్టు పంపాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంకు వెళ్తే చాలు. ఏటీఏం ఏంటీ.. ఉత్తరం ఏంటీ.. అనుకుంటున్నారా! అవును.. ఇదంతా త్వరలోనే నిజం కానుంది. ఎస్‌బీఐ తమ ఏటీఎం మెషీన్ల ద్వారా ఉత్తరాలు బట్వాడా చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకోడానికి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే తొలుత స్పీడ్ పోస్టు సౌకర్యం మాత్రమే కల్పించనున్నారు.
ఈ కొత్త ఆలోచన ఎలా పనిచేస్తుందో మీరే చదవండి.. వినియోగదారులు ఉత్తరాలు పంపేందుకు వీలుగా ఏటీఎంల సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేస్తారు. ఏటీఎం కార్డు పెట్టగానే తెరపై స్పీడ్‌పోస్టు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏటీఎం మిషన్ పక్కన బరువు తూచే చిన్న యంత్రం కూడా ఉంటుంది. ఏటీఎంలో స్పీడ్ పోస్టు ఆప్షన్ క్లిక్ చేశాక పక్కనున్న తూకంపై మీ కవర్ పెట్టగానే పోస్టుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుపుతుంది. ఆ మొత్తాన్ని ఏటీఎం ద్వారా చెల్లించిన తర్వాత మిషన్ నుంచి వచ్చే రషీదును కవర్‌కు అతికించి పక్కనే ఏర్పాటు చేసిన క్లియరెన్స్ బాక్సులో వేయాలి.
తపాలా శాఖ సిబ్బంది వచ్చి పోస్టు చేయాల్సిన కవర్‌లను సేకరిస్తారు. ఏటీఎం ద్వారా పంపిన స్పీడ్ పోస్టుల వివరాలు ఎప్పటిప్పుడు ఎస్‌బీఐ, తపాలా శాఖకు ఆన్‌లైన్ ద్వారా చేరతాయి. ఆ వివరాలను బట్టి పోస్టల్ సిబ్బంది వచ్చి ఎప్పటికప్పుడు ఏటీఎంలకు వెళ్లి వాటిని సేకరిస్తారు. వినియోగదారులు చెల్లించే స్పీడ్ పోస్టు చార్జీల్లో కొంత మొత్తం కమిషన్ రూపంలో ఎస్‌బీఐకి చేరుతుంది. తపాలా శాఖ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ సుధాకర్ ఈ కొత్త ఆలోచన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.