ఉద్యోగుల సర్దుబాటుకే ప్రాధాన్యం! | preferred! to the adjust of employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సర్దుబాటుకే ప్రాధాన్యం!

Published Fri, Sep 2 2016 12:13 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ఉద్యోగుల సర్దుబాటుకే ప్రాధాన్యం! - Sakshi

ఉద్యోగుల సర్దుబాటుకే ప్రాధాన్యం!

కొత్త జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం యోచన
- ప్రమోషన్లు, నూతన నియామకాలు ప్రస్తుతం లేనట్లే
- ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చి కొత్త జిల్లాల్లో కొలువులు
- రాష్ట్రం యూనిట్‌గా ఉద్యోగుల కేటాయింపు
- శాఖలవారీగా ఉద్యోగుల ప్రణాళికపై సీఎస్ సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్:
కొత్త జిల్లాలకు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు వీలుగా ఒకే తరహా పనితీరున్న విభాగాలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఉద్యోగులను ప్రస్తుతమున్న జిల్లాల నుంచి అక్కడే కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు పంపిణీ చేయకుండా... రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా గుర్తించి 27 జిల్లాలకు సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. కొత్త పోస్టులు అవసరమైనా కూడా... నియామకాలు చేపడితే ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో ఉన్న ఉద్యోగులనే అన్ని జిల్లాలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే సీనియర్ ఉద్యోగులకు జిల్లాస్థాయి హోదా ఉన్న అధికారులుగా ప్రమోషన్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించినా.. ఒక్కసారిగా భారీగా ప్రమోషన్లతో ఆర్థిక భారం పడుతుందని భావిస్తోంది. దీంతో ప్రమోషన్లు ఇవ్వకుండా కొంతకాలం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మొత్తంగా ఉద్యోగుల కేటాయింపు తుది ప్రణాళికల తయారీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

 పది శాఖలతో సమీక్ష
 కొత్త జిల్లాలకు ఉద్యోగుల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం సచివాలయంలో దాదాపు పది శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్షించారు. ఆయా శాఖలు సమర్పించిన ఉద్యోగుల ప్రణాళికలను విభాగాల వారీగా చర్చించారు. పునర్విభజనతో ఏయే విభాగాలపై ఎలాంటి ప్రభావం ఉంది, సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు ఏయే చర్యలు చేపట్టాలి, ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశాలను ప్రధానంగా పరిశీలించారు. జిల్లా జైళ్లను యథాతథంగా కొనసాగించాలని, అవసరమైతే కొత్త జిల్లాల్లో ఉన్న జైళ్లను జిల్లా జైళ్లుగా మార్చేందుకు న్యాయ శాఖతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. జిల్లాల్లో ఇప్పుడున్న సైనిక సంక్షేమ అధికారిని రీజనల్ సైనిక సంక్షేమ అధికారి హోదా కల్పించి.. ఆ పరిధి లో ఉన్న కొత్త జిల్లాల్లో శాఖ బాధ్యతలు అప్పగిస్తారు.

అగ్నిమాపక విభాగంలోనూ ఇదే పద్ధతిని అనుసరించనున్నారు. సమాచార, పౌర సంబంధాల విభాగంలో జిల్లా, డివిజనల్ కార్యాలయాల్లోని ఉద్యోగులందరినీ ఒకే యూనిట్‌గా భావించి మొత్తం 27 జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్‌ను ప్రొటోకాల్ అధికారిగా గుర్తించి, ప్రతి నెలా ప్రొటోకాల్ ఖర్చులకు రూ.లక్ష కేటాయిస్తారు. ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీ కార్యాలయాల్లో ఇప్పుడున్న ఎస్‌టీవోలు, డీటీవోలను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. ప్రతి జిల్లాకు కొత్తగా ఆడిట్ ఆఫీసర్లను నియమిస్తారు. బడ్జెట్ కేటాయింపులకు వీలుగా ప్రతి జిల్లాకు కొత్త కోడ్‌లతో పద్దులను రూపొందిస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి శాఖలను విలీనం చేసేందుకు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం జిల్లాల్లో డీఆర్‌డీఏ, డీడబ్ల్యూఎంఏ (డ్వామా) విడివిడిగా ఉన్నాయి. వేర్వేరు ప్రాజెక్టు డెరైక్టర్లున్నారు. ఈ రెండు విభాగాలను కలిపేసి గ్రామీణాభివృద్ధి విభాగం పేరిట కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఇప్పుడున్న ప్రాజెక్టు డెరైక్టర్లనే కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసే వీలుందని, ఏడు జిల్లాలకు మాత్రమే కొత్త పీడీలు అవసరమని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement